North India Floods:
మూడు రోజులుగా భారీ వర్షాలు..
ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లోనే వరదల కారణంగా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్‌లు కొనసాగుతున్నాయి. హిమాచల్‌లోని కసోల్, మణికరన్, ఖీర్ గంగ, పుల్గా ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుకు ఏరియల్ సర్వే నిర్వహించారు. కులూ ఏరియాలో దాదాపు 40 షాప్‌లు, 30 ఇళ్లు వరదల ధాటికి కొట్టుకుపోయాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లహౌల్, స్పితి, మనాలిలో చిక్కుకుపోయిన టూరిస్ట్‌లనూ కాపాడారు. హాస్పిటల్‌లో వారికి చికిత్స అందిస్తున్నారు. వాళ్లందరినీ సురక్షితంగా రాష్ట్రం దాటిస్తామని సీఎం సుఖ్వీందర్ హామీ ఇచ్చారు. చంద్రతల్ ప్రాంతంలో దాదాపు 250 మంది టూరిస్ట్‌లు వరదల్లో చిక్కుకుపోయారు. మనాలిలో 300 మంది వరదల్లో చిక్కుకున్నారు. ఇక యూపీలోనూ దాదాపు ఇవే పరిస్థితులున్నాయి. హిమాచల్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. వరదల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు యూపీ సర్కార్ కూడా సాయం చేస్తోంది. మొత్తం 18 రాష్ట్రాల్లో వరద ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటి వరకూ 8,815 ధ్వంసం కాగా... 47,225 హెక్టార్ల పంట నష్టం వాటిల్లింది.
కొట్టుకుపోతున్న వంతెనలు..
ఉత్తరాఖండ్‌లో వరదల ధాటికి కొండ చరియలు విరిగి పడుతున్నాయి. గంగోత్రి నేషనల్ హైవేపై కొండ చరియలు విరిగి పడడం వల్ల రోడ్ బ్లాక్ అయింది. మూడు వాహనాలు వరదల్లో కూరుకుపోయాయి. ఈ ప్రమాదంలో 5గురు యాత్రికులు చనిపోయారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. జుమ్మాగడ్‌లో ఉన్నట్టుండి వరదలు ముంచెత్తాయి. చమోలి జిల్లాలో ఓ వంతెన కొట్టుకుపోయింది. ఇండియా-టిబెట్‌ని కనెక్ట్ చేసే దారి మూసుకుపోయింది. సరిహద్దు గ్రామాలకు చేరుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. హరియాణా పంజాబ్‌లోనూ వరదలు సవాల్‌గా మారాయి. రెండ్రోజుల పాటు కురిసిన వర్షాలకు భారీ నష్టం వాటిల్లింది. రూప్‌నగర్, పటియాలా, మొహాలి, అంబాలా, పంచ్‌కుల ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. హోషియార్‌పూర్‌లో ఇల్లు కూలిన ఘటనలో ఓ 75 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. సుల్తాన్‌పూర్‌లో వరద నీటిలో ఓ యువకుడు కొట్టుకుపోయాడు. ఓ రెసిడెన్షియల్ స్కూల్‌లోని 370 మంది విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. హరియాణాలోని గగ్గర్ నది పోటెత్తుతోంది. గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేని విధంగా చెరువులు, నదులు ప్రమాదకర స్థాయిలో ముంచెత్తుతున్నాయి. ఢిల్లీలోని యమునా నది 206 మీటర్ల లెవెల్ దాటి ప్రవహిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజల్ని తరలిస్తున్నారు.