NEET Frisking Row: కేరళలో ఓ పరీక్షా కేంద్రంలో నీట్ ఎగ్జామ్ నిర్వహణపై ఆరోపణలు వెల్లువెత్తడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు నిజనిర్ధారణ కమిటీ (ఫ్యాక్ట్ చెక్ కమిటీ) ఏర్పాటు చేసింది.


మీడియా కథనాలతో


కేరళలో నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థినులను లోదుస్తులు విప్పాలని ఓ కళాశాల యాజమాన్యం కోరిందంటూ  వివిధ మీడియాలలో కథనాలు వెలువడ్డాయి. మీడియా కథనాలతో సమాచారం తెలుసుకున్న కేంద్ర విద్యాశాఖ.. కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.


కమిటీ సభ్యులు ఘటన జరిగిన కొల్లంను సందర్శించి నివేదిక రూపొందిస్తారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. దాని ఆధారంగా తుది చర్యలు తీసుకుంటామన్నారు.


ఐదుగురు అరెస్ట్


మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఐదుగురు మహిళలను అరెస్ట్​ చేసినట్లు కేరళ పోలీసులు వెల్లడించారు. సెక్యూర్టీ ఏజెన్సీకి చెందిన గీతు, జ్యోత్స్న‌, బీనాల‌తో పాటు కాలేజీలోని క్లీనింగ్ సిబ్బందికి చెందిన మ‌రో ఇద్ద‌ర్ని అరెస్టు చేశారు. వీరంతా పరీక్ష జరిగిన రోజున కళాశాలలో విధులు నిర్వర్తించినట్లు తెలిపారు.


కొల్లంలోని మార్థ‌మాస్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ ఉన్న సీసీటీవీ ఫూటేజ్‌ను పోలీసులు త‌నిఖీ చేశారు. అయితే మ‌హిళా విద్యార్థినిల‌ను న‌లుగురు సిబ్బంది ఫ్రిస్కింగ్ చేసిన‌ట్లు గుర్తించారు.


ఇదీ జరిగింది


కొల్లంలోని 'మార్ థోమా' కళాశాలలో విద్యార్థినులు లోదుస్తులు తీసిన తర్వాతే నీట్ పరీక్షకు అనుమతించారని మీడియాలో వార్తలొచ్చాయి. ఈ మేరకు కేంద్రంలో పరీక్ష రాసిన ఓ విద్యార్థిని ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


నీట్‌ నిబంధనల ప్రకారమే తమ కూతురు బట్టలు వేసుకుందని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్థినులు లోదుస్తులు లేకుండా మూడు గంటలపాటు కూర్చొని పరీక్ష ఎలా రాస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయిస్తామని వారు తెలిపారు.


ఈ ఘటనపై కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్‌.బిందు స్పందించారు. విద్యార్థినుల పట్ల సిబ్బంది తీరు సరైందికాదని, ఈ విషయాన్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అయితే ఈ సంఘటనను కేరళ రాష్ట్ర మహిళా కమిషన్‌ సుమోటోగా విచారణకు స్వీకరించింది.


Also Read: Corona Cases: దేశంలో మళ్లీ 20 వేల కరోనా కేసులు- 40 మంది మృతి


Also Read: COVID-19 Vaccine in India: 'ఇది మీ వల్లే సాధ్యమైంది'- భారత్‌ రికార్డ్‌పై ప్రధాని మోదీ లేఖ