Jharkhand News: ఝార్ఖండ్‌లో దారుణ ఘటన జరిగింది. రాంచీలో ఓ మహిళా ఎస్‌ఐని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఓ చెక్ పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా వాహనంతో ఢీకొట్టి చంపేశారు. హరియాణాలో డీఎస్‌పీ హత్య జరిగిన మంగళవారమే ఈ ఘటన కూడా జరిగింది.
ఇదీ జరిగింది
సంధ్యా టోప్పో అనే మహిళ తుపుదానా పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి ఓ చెక్‌పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సమయంలో దారిలో వెళ్తున్న ఓ వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులను పట్టించుకోకుండా నిందితులు వాహనాన్ని ముందుకు పోనిచ్చారు.
దీంతో సబ్ ఇన్స్పెక్టర్ సంధ్యపై నుంచి వాహనం దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు.
హరియాణాలో
హరియాణాలో అక్రమ మైనింగ్‌పై విచారణకు వెళ్లిన డీఎస్‌పీని లారీతో ఢీ కొట్టి హత్య చేశారు దుండగులు. నుహ్‌లో ఉన్న రాతి గనుల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందనే ఆరోపణలు రావడంతో డీఎస్‌పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ దర్యాప్తు చేస్తున్నారు. ఆధారాలు లభ్యం కావడంతో పంచగావ్ వద్ద ఉన్న ఆరావళి కొండల వద్ద అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు డీఎస్‌పీ అక్కడికి వెళ్లారు. అయితే అటుగా వెళ్తున్న ఓ లారీని అడ్డుకునేందుకు ఆయన ప్రయత్నించారు.
లారీ డ్రైవర్ ఇవేవీ పట్టించుకోకుండా పోలీసులపైకి వాహనాన్ని పోనిచ్చాడు. డీఎస్‌పీ వెంట ఆయన గన్‌మన్, డ్రైవర్ ఉన్నారు. లారీ దూసుకొచ్చిన సమయంలో ఇద్దరూ పక్కకు దూకేశారు. డీఎస్‌పీ తప్పించుకోలేకపోయారు. లారీతో ఢీకొట్టిన వెంటనే నిందితుడు పారిపోయాడు. అయితే డీఎస్‌పీని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Also Read: Sri Lanka Crisis: శ్రీలంకను అప్పుల కుంపటే కాల్చేసింది, మీరూ జాగ్రత్త!
Also Read: NEET 2022 Dress Code: లోదుస్తులు తీస్తేనే పరీక్ష రాయడానికి అనుమతి- కేరళలో దారుణం!