NEET 2022 Dress Code: నీట్ పరీక్షకు హాజరయ్యే ముందు లోదుస్తులు విప్పాలని సిబ్బంది ఒత్తిడి చేసినట్లు వచ్చిన వార్తలు సంచలనంగా మారాయి. కేరళ కొల్లంలో నీట్ పరీక్ష నిర్వహణ సందర్భంగా ఓ కేంద్రంలో సిబ్బంది ఇలా వ్యవహరించినట్లు బాధితులు ఆరోపించారు. ఈ ఘటనపై మరికొంతమంది విద్యార్థినులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ జరిగింది
కొల్లంలోని 'మార్ థోమా' కళాశాలలో విద్యార్థినులు లోదుస్తులు తీసిన తర్వాతే నీట్ పరీక్షకు అనుమతించారని మీడియాలో వార్తలొచ్చాయి. ఈ మేరకు కేంద్రంలో పరీక్ష రాసిన ఓ విద్యార్థిని ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
నీట్ నిబంధనల ప్రకారమే తమ కూతురు బట్టలు వేసుకుందని తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్థినులు లోదుస్తులు లేకుండా మూడు గంటలపాటు కూర్చొని పరీక్ష ఎలా రాస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆశ్రయిస్తామని వారు తెలిపారు.
ప్రభుత్వం
ఈ ఘటనపై కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్.బిందు స్పందించారు. విద్యార్థినుల పట్ల సిబ్బంది తీరు సరైందికాదని, ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అయితే ఈ సంఘటనను కేరళ రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది.
ఎన్‌టీఏ ఏమందంటే?
అయితే ఈ వార్తలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కొట్టిపారేసింది. ఈ ఘటనపై పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్‌ను విచారించనట్లు తెలిపింది. ఈ విచారణలో లోదుస్తులు తీసిన తర్వాతే అనుమతించారనే వార్తలు కల్పితమని, దురుద్దేశపూర్వకమని తేలినట్లు వెల్లడించింది.
Also Read: Haryana DSP Killed: మైనింగ్ మాఫియా దారుణం- DSPని లారీతో ఢీకొట్టి హత్య!
Also Read: SC On Nupur Sharma: నుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట- కీలక ఆదేశాలు జారీ