Haryana DSP Killed: మైనింగ్ మాఫియాకు ఏకంగా ఓ డీఎస్‌పీ బలైపోయిన దారుణ ఘటన హరియాణాలో జరిగింది. అక్రమ మైనింగ్‌పై విచారణకు వెళ్లిన డీఎస్‌పీని లారీతో ఢీ కొట్టి హత్య చేశారు దుండగులు.


ఇదీ జరిగింది


నుహ్​లో ఉన్న రాతి గనుల్లో అక్రమ మైనింగ్​ జరుగుతోందనే ఆరోపణలు రావడంతో డీఎస్‌పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్​ దర్యాప్తు చేస్తున్నారు. ఆధారాలు లభ్యం కావడంతో పంచగావ్ వద్ద ఉన్న ఆరావళి కొండల వద్ద అక్రమ మైనింగ్​ను అడ్డుకునేందుకు డీఎస్‌పీ అక్కడికి వెళ్లారు. అయితే అటుగా వెళ్తున్న ఓ లారీని అడ్డుకునేందుకు ఆయన ప్రయత్నించారు.


లారీ డ్రైవర్ ఇవేవీ పట్టించుకోకుండా పోలీసులపైకి వాహనాన్ని పోనిచ్చాడు. డీఎస్​పీ వెంట ఆయన గన్​మన్, డ్రైవర్ ఉన్నారు. లారీ దూసుకొచ్చిన సమయంలో ఇద్దరూ పక్కకు దూకేశారు. డీఎస్​పీ తప్పించుకోలేకపోయారు. లారీతో ఢీకొట్టిన వెంటనే నిందితుడు పారిపోయాడు.  అయితే డీఎస్‌పీని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.






పోలీసుల వేట


సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అదనపు బలగాలతో ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్నంతా తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. నిందితుల్ని పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు.


కొద్ది నెలల్లోనే డీఎస్​పీ సురేంద్ర సింగ్ బిష్టోయ్ రిటైర్ కానున్నారు. అయితే ఈలోపే విధి నిర్వహణలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.  ఆయన మృతిని హరియాణా పోలీసు విభాగం ధ్రువీకరించింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. నిందితులను పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని స్పష్టం చేసింది. అక్రమ మైనింగ్‌ను ఎట్టిపరిస్థితుల్లోను సహించబోమని పోలీసులు తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసు అధికారిని దారుణంగా హత్య చేయడమంటే ప్రభుత్వ వైఫల్యమేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.


Also Read: SC On Nupur Sharma: నుపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊరట- కీలక ఆదేశాలు జారీ