Agnipath Scheme: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్లను దిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది.


వీటితో పాటు కేరళ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను కూడా దిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.






ఆగండి


పెండింగ్ కేసుల బదిలీపై పిటిషన్లరకు ఎలాంటి అభ్యంతరాలున్నా దిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు విచారణ ఆపాలని ఆయా కోర్టులకు సుప్రీం వెల్లడించింది. అగ్నిపథ్​పై ఇప్పటికే పెండింగ్​లో ఉన్న కేసులు సహా బదిలీ చేసిన పిటిషన్​లను కూడా పరిశీలించాలని దిల్లీ హైకోర్టుకు సుప్రీం స్పష్టం చేసింది.


ఇదీ జరిగింది


జూన్ 14న అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్, బిహార్, తెలంగాణ, బంగాల్, హరియాణా ఇలా చాలా రాష్ట్రాల్లో హింసాత్మకంగా ఆందోళనలు జరిగాయి. అగ్నిపథ్‌ను ఉపసంహరించుకొని పాత నియామక పద్ధతిని పునరుద్ధరించాలని యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు.


భారీగా దరఖాస్తులు


మరోవైపు దేశవ్యాప్తంగా 'అగ్నిపథ్‌' పథకానికి విశేష స్పందన లభించింది. భారత వాయుసేనలో ఖాళీలకు 7.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. భారత వాయుసేన చరిత్రలో ఇంత అత్యధిక స్థాయిలో దరఖాస్తులు రావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.


వాయుసేన అగ్నిపథ్‌ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తుల ప్రక్రియ జూన్‌ 24న ప్రారంభం అయింది. జులై 5తో ముగిసింది. వాయుసేనలో అగ్నివీర్ తొలి బ్యాచ్‌ను ఈ ఏడాది డిసెంబరు 11న ప్రకటించనున్నారు.