Jitendra Awhad on Lord Ram:
క్లారిటీ ఇచ్చిన జితేంద్ర..
రాముడు మాంసాహారి అంటూ NCP నేత జితేంద్ర అవ్హద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీజేపీ నేతలు ఈ కామెంట్స్‌పై తీవ్రంగా మండి పడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై స్పందించిన జితేంద్ర చివరకు క్షమాపణలు చెప్పారు. ఎవరి మనోభావాలను దెబ్బ తీయడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. అలా మాట్లాడకుండా ఉండాల్సిందని అన్నారు.
"నా వ్యాఖ్యలు కొంత మంది మనోభావాలను దెబ్బ తీసిందని తెలిసి బాధగా అనిపించింది. అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఒకరి మనోభావాలు దెబ్బ తీయడం నా ఉద్దేశం కాదు. అయినా రాముడు మాంసాహారి అని నేను సొంతగా సృష్టించింది ఏమీ కాదు. వాల్మీకి రామాయణంలోనే అది రాసుంది. 1891 నాటి అధికారిక ప్రతిని కోల్‌కత్తా ఐఐటీ కాన్పూర్‌లో ప్రింట్ చేశారు. ఈ విషయంలో చాలా రీసెర్చ్ జరిగింది. అదే నేను ఇవాళ ప్రజల ముందుంచాను. నేనేమీ సొంతగా ఈ వ్యాఖ్యలు చేయలేదు. నేను చెప్పిందంతా 1891 నాటి పుస్తకంలో రాసుందే. ఆ పుస్తకాన్ని నేనేమీ రాయలేదు"
- జితేంద్ర అవ్హద్, NCP నేత
ప్రతిపక్షాలపై బీజేపీ ఫైర్..
ఇప్పటికే జితేంద్ర వ్యాఖ్యలపై బీజేపీ నేత పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. రాముడి భక్తుల మనోభావాలు దెబ్బ తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో I.N.D.I.A కూటమిపైనా ఫైర్ అయ్యారు.
"ప్రతిపక్షాల వైఖరే ఇంత. రాముడి భక్తుల మనోభావాలను దెబ్బ తీయడమే వాళ్ల పని. ఓట్లు రాబట్టుకునేందుకు హిందువుల గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడడం సరికాదు. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తైంది. బహుశా ఇది జీర్ణించుకోలేక వాళ్లు అలా మాట్లాడుతున్నారేమో"
- రామ్ కదం, బీజేపీ నేత
NCP నేత జితేంద్ర అవ్హద్ (Jitendra Awhad) రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు మాంసాహారి అని ఆయన చేసిన కామెంట్స్ సంచలనమవుతున్నాయి. శరద్ పవార్ క్యాంప్‌కి చెందిన NCP నేత అయిన జితేంద్ర షిరిడీలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడే ఈ వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు. రాముడు బహుజన వర్గానికి చెందిన వాడని అన్నారు. ఆయన జంతువులను వేటాడి వాటి మాంసం తినే వాడని తేల్చి చెప్పారు. అన్నేళ్ల పాటు అడవిలో ఉన్న రాముడికి శాకాహారం ఎక్కడ దొరికిందని ప్రశ్నించారు.
"రాముడు బహుజన వర్గానికి చెందిన వాడు. ఆయన జంతువులను వేటాడి వాటి మాంసం తినేవాడు. రాముడిని ఉదాహరణగా చూపించి అందరూ శాకాహారులైపోవాలని ప్రచారం చేస్తున్నారు. కానీ రాముడు శాకాహారి కాదు..మాంసాహారి. 14 ఏళ్ల పాటు అడవిలో ఉన్న రాముడికి శాకాహారం ఎక్కడ నుంచి దొరుకుతుంది..?"
- జితేంద్ర అవ్హద్, ఎన్‌సీపీ నేత
Also Read: ఏ తప్పూ చేయలేదు, నా అడ్డు తొలగించుకోడానికి బీజేపీ చేస్తున్న కుట్ర ఇది - ఈడీ సమన్లపై కేజ్రీవాల్