Arvind Kejriwal on ED Summons:
కేజ్రీవాల్ కామెంట్స్..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారన్న ఊహాగానాలు వస్తున్న క్రమంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రచారం చేయకుండా తనను అడ్డుకోడానికే బీజేపీ ఈ కుట్ర చేస్తోందని మండి పడ్డారు. తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. ఈడీ ఇచ్చిన సమన్లు లీగల్‌గా చెల్లవని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఈడీకి ప్రత్యేకంగా లేఖ రాశారు కేజ్రీవాల్. తనకు సమన్లు పంపడం వెనక ఉద్దేశమేంటో చెప్పాలని ఆ లేఖలో ప్రస్తావించారు. ఈడీ ముందు హాజరు కావాలంటూ పంపిన సమన్లను ఆయన ఖండించారు. హాజరయ్యే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వీడియో విడుదల చేశారు. లిక్కర్ పాలసీ స్కామ్‌లో భాగంగా విచారణకు రావాలని ఈడీ కేజ్రీవాల్‌కి సమన్లు పంపింది.
"కేవలం నన్ను అడ్డుకోడానికి బీజేపీ చేస్తున్న కుట్ర ఇది. నేనే తప్పు చేయలేదన్నది నిజం. కానీ బీజేపీ మాత్రం ఏదో జరిగిపోయిందని చెప్పి నన్ను అరెస్ట్ చేయాలని చూస్తోంది. నా నిజాయతీయే నాకున్న ఆస్తి. ఈడీ పంపిన సమన్లు చెల్లవని ఇప్పటికే మా లాయర్లు చెప్పారు. నాపై విచారణ జరిపించాలని కాదు...లోక్‌సభ ఎన్నికల ముందు ప్రచారం చేయకుండా కట్టడి చేసేందుకే ఇదంతా"
- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే మూడు సార్లు సమన్లు పంపింది ఈడీ. మూడుసార్లూ విచారణకు కేజ్రీవాల్ హాజరు కాలేదు. వాళ్లు పంపిన సమన్లు ఎందుకు చట్టబద్ధం కావో వివరించానని, వాళ్ల దగ్గర ఏ సమాధానమూ లేదని విమర్శించారు. జనవరి 19న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయని, ఆ తరవాత 26న గణతంత్ర వేడుకలకు హాజరవ్వాల్సి ఉందని వివరించారు. కేజ్రీవాల్ ఇచ్చిన సమాధానాన్ని తాము పరిశీలిస్తున్నామని...నాలుగోసారీ సమన్లు జారీ చేసే యోచనలో ఉన్నామని ఈడీ స్పష్టం చేసింది. అయితే...లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అరవింద్ కేజ్రీవాల్ మూడు రోజుల పాటు గుజరాత్‌లో పర్యటించనున్నారు. అక్కడ పలు సమావేశాలకు హాజరవ్వడంతో పాటు బహిరంగ సభల్లోనూ పాల్గొననున్నారు.
‘కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ సోదాలు జరపనున్నట్లు మాకు సమాచారం అందుతోంది. బహుశా ఆయన్ను అరెస్ట్ చేయొచ్చు’ అంటూ ఆప్ కీలక నేత అతిశీ సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఆప్ జాతీయ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం ఉందని ‘డైలాగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిషన్ ఆఫ్ దిల్లీ’ ఛైర్‌పర్సన్ జాస్మిన్ షా పేర్కొన్నారు.
Also Read: Petro Rates: ప్రజల ఆశలపై పెట్రోల్ చల్లిన ప్రభుత్వం, పైసా కూడా తగ్గించదట