WFI controversy: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో జంతర్‌మంతర్(Janta Mantar) వద్ద జూనియర్ రెజ్లర్ల ఆందోళనతో అడ్‌హక్ కమిటీ(ad-hoc panel ) స్పందించింది. తమ కెరీర్‌లో కీలకమైన ఒక ఏడాదిని కోల్పోయామంటూ వందల సంఖ్యలో జూనియర్ రెజ్లర్లు ఆందోళన చేశారు. ఈ పరిస్థితికి దిగ్గజ కుస్తీయోధులైన భజరంగ్ పునియా(Bajarang Punia), సాక్షి మలిక్(Sakshi Malik), వినేశ్ ఫొగాట్(Vinesh) కారణమని ఆరోపించారు.
ఏడాదికాలంగా రెజ్లింగ్ పోటీలు లేక విలువైన కెరీర్ కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసనకు దిగిన జూనియర్ రెజ్లర్లకు భారత రెజ్లింగ్ సమాఖ్య అడ్ హక్ కమిటీ శుభవార్త చెప్పింది. ఆరు వారాల్లో అండర్ -15, అండర్ – 20 నేషనల్ ఛాంపియన్‌షిప్స్ నిర్వహిస్తామని తెలిపింది. గ్వాలియర్ వేదికగా ఈ పోటీలు ఉంటాయని అడ్‌హక్ కమిటీ చైర్మన్ భూపీందర్ సింగ్ బజ్వా వెల్లడించారు. యువ రెజ్లర్లు ఈ పోటీలకు సన్నద్ధం కావాలని కోరారు.
ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, ఢిల్లీకి చెందిన జూనియర్ రెజ్లర్లు బస్సుల్లో జంతర్‌మంతర్‌కు చేరుకుని పునియా, సాక్షి, వినేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ముగ్గురు రెజ్లర్ల నుంచి మా రెజ్లింగ్‌ను కాపాడండి’అని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్‌ను అభ్యర్థిస్తూ బ్యానర్లను ప్రదర్శించారు. మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక ఆరోపణలు చేస్తూ సరిగ్గా ఏడాది క్రితం స్టార్ రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. ఫలితంగా సమాఖ్య కార్యకలాపాలు తాత్కాలిక కమిటీ చేతిలోకి వెళ్లిపోయాయి. బ్రిజ్ భూషణ్ రెజ్లింగ్ రాజకీయాలకు దూరమయ్యాడు.
కొత్త తలనొప్పి
తాము రెజ్లింగ్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యయుతంగా గెలిచామని... తాము గెలిచిన పత్రాలపై రిటర్నింగ్ ఆఫీసర్ సంతకాలు కూడా చేశారని... వాళ్లు దానిని ఎలా మరుగునపెడతారని సంజయ్ సింగ్(suspended WFI president Sanjay Singh) ప్రశ్నించారు. ఈ అడ్‌హక్ ప్యానెల్‌ను తాము గుర్తించబోమని.. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తమపై విధించిన సస్పెన్షన్‌ను కూడా తాము గుర్తించమని కుండబద్దలు కొట్టాడు. WFI తన పని తాను చేసుకుపోతోందని.. తాము తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నామని తెలిపాడు. స్టేట్ అసోసియేషన్స్ టీమ్స్‌ను పంపకపోతే అడ్‌హక్ కమిటీ నేషనల్ ఛాంపియన్స్ ఎలా నిర్వహిస్తుందని సంజయ్‌సింగ్ ప్రశ్నించారు. తాము త్వరలోనే నేషనల్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తామని.. త్వరలోనే ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరుపుతామని తెలిపాడు. అడ్‌హక్ కమిటీ కంటే ముందే తామే నేషనల్ ఛాంపియన్‌షిప్ నిర్వహించి తీరుతామని సంజయ్ సింగ్ చెప్పాడు. సంజయ్ సింగ్ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. పారిస్ ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్న వేళ రెజ్లర్లకు ఈ సమస్య కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టేలా ఉంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తమపై విధించిన సస్పెన్షన్‌పై లేఖ రాశామని, దానికి సమాధానం రావాల్సి ఉందని సంజయ్ సింగ్ అన్నారు. తాము నిబంధనలను ఉల్లంఘించలేదని తెలిపాడు. కేంద్రం చర్చలకు రాకుంటే తాము కూడా ఆ సస్పెన్షన్‌ను అంతగా పట్టించుకోమని కుండబద్దలు కొట్టాడు.
కొనసాగుతున్న మద్దతు
భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ (Sanjay Singh) ఎన్నికవడంతో వివాదం కొనసాగుతోంది. సంజయ్ సింగ్ WFI కొత్త అధ్యక్షుడిగా ఎన్నికకావడాన్ని పలువురు రెజ్లర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటికే రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా.. మరో దిగ్గజ రెజ్లర్ బజ్‌రంగ్ పునియా పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశాడు. వినేశ్ ఫొగాట్ కూడా ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేసింది.