ఢిల్లీలో నేషనల్ డెమొక్రటిక్ అలియన్స్ (ఎన్డీఏ) సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి ముందు ప్రధాని మోదీ నేతలతో సమావేశమయ్యారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ (అజిత్ పవార్ వర్గం), మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ, చిరాగ్ పాశవాన్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఢిల్లీలోని అశోకా హోటల్‌లో ఈ సమావేశం జరుగుతోంది. ఎన్డీఏ ఏర్పడి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించుకోనున్నారు.


సాయంత్రం 5.30 గంటలకు ఎన్డీఏ మీటింగ్ ప్రారంభం అయింది. వచ్చే ఏడాది 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం (జులై 18) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో 38 పార్టీలు పాల్గొన్నాయి. ఇక విపక్షాల కూటమికి 26 పార్టీలు హాజరైనట్లు పేర్కొనగా.. ఎన్డీఏ పక్షాల భేటీకి మాత్రం 38 పార్టీలు హాజరైనట్టు తెలుస్తోంది.






ఎన్డీయే సమావేశానికి హాజరైన పార్టీలు ఇవే


భారతీయ జనతా పార్టీ (బీజేపీ), జనసేన, శివసేన ( ఏక్‌నాథ్ షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం), రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (పశుపతి కుమార్ పరాస్), ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం, అప్నా దల్ (సోనేలాల్), నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, సిక్కిం రివల్యూషనరీ ఫ్రంట్, మిజో నేషనల్ ఫ్రంట్, ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర, నాగా పీపుల్స్ ఫ్రంట్, నాగాలాండ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే), అస్సాం గణ పరిషత్, పట్టాలి మక్కల్ కాచి, తమిళ మనీలా కాంగ్రెస్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, శిరోమణి అకాలీదళ్ (యునైటెడ్), మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, జననాయక్ జనతా పార్టీ, ప్రహార్ జనశక్తి పార్టీ, నేషనల్ సొసైటీ పార్టీ, జన సురాజ్య శక్తి పార్టీ, కుకీ పీపుల్స్ అలయన్స్ యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (మేఘాలయ), హిల్ స్టేట్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, నిషాద్ పార్టీ, ఆల్ ఇండియా NR కాంగ్రెస్, హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM), హర్యానా లోఖిత్ పార్టీ, భారత ధర్మ జన సేన, కేరళ కామరాజ్ కాంగ్రెస్, పుతియ తమిళగం, లోక్ జన శక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్), గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ పార్టీలు హాజరు అయ్యాయి.


విపక్షాల మీటింగ్ పై మోదీ సెటైర్లు





మరోవైపు, విపక్షాల బెంగళూరు సమావేశం సందర్భంగా నేడు మధ్యాహ్నం అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న ప్రధాని మోదీ విమర్శలు చేశారు. కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు కుటుంబాల కోసమే పని చేస్తాయని ఆరోపణలు చేశారు. యూపీఏ పాలన, విపక్షాల భేటీలపై సెటైర్లు పేల్చారు. విపక్షాలు సొంత లాభం కోసమే పని చేస్తున్నాయని ఆరోపించారు. 9 ఏళ్లల్లో తాము ఎంతో అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. అండమాన్‌నికోబార్‌ దీవుల్లోని ఓ ఎయిర్ పోర్టులో కొత్తగా నిర్మించిన సావర్కర్ టెర్మినల్‌ ను మోదీ ప్రారంభించారు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇలా దేశంలోని ఏ మూలకు వెళ్లినా తాము చేసిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు.