తన జపాన్ పర్యటనలో రెండో రోజున ప్రధాని నరేంద్ర మోదీ టోక్యోలో ఏర్పాటు చేసిన క్వాడ్ లీడర్స్ సమ్మిట్ నాల్గో ఎడిషన్‌లో పాల్గొన్నారు. క్వాడ్ నాయకులు - ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా, యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు జో బైడెన్.. ప్రపంచ సమస్యల గురించి తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఉమ్మడి అభిరుచులపై చర్చలు జరిపారు.
అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌తో సహా సభ్య దేశాలు విశ్వాసం, ఒకే సంకల్పంతో ఉంటే ప్రజాస్వామ్యానికి కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
క్వాడ్ పరిధి విస్తృతమైంది: ప్రధాని మోదీ
క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌కు ముందు తన ప్రారంభ ఉపన్యాసంలో పీఎం మోదీ ఇలా అన్నారు. "చాలా తక్కువ వ్యవధిలోనే ప్రపంచం ముందు క్వాడ్ తనకంటూ ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు క్వాడ్ పరిధి చాలా విస్తృతమైంది. చాలా ప్రభావవంతంగా మారింది. మన పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్యానికి కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తోంది."
కోవిడ్-19 క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పటికీ వ్యాక్సిన్ డెలివరీ, వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ, ఆర్థిక సహకారం వంటి అనేక రంగాలలో సభ్య దేశాలు సహకరించుకున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. "ఇది ఇండో-పసిఫిక్‌లో శాంతి, శ్రేయస్సు, స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది," అన్నారాయన.
ఎన్నికల్లో విజయం సాధించినందుకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌ను ప్రధాని మోదీ అభినందించారు. "ప్రమాణం చేసిన 24 గంటల తర్వాత మీరు మా మధ్య ఉండటం క్వాడ్ స్నేహ బలాన్ని, దాని పట్ల మీ నిబద్ధత తెలియజేస్తుంది."అని అన్నారు.
జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు, ప్రధాని మోదీ టోక్యోలో జరుగుతున్న మూడో క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్‌తో కలిసి పాల్గొంటున్నారు.
మార్చి 2021లో క్వాడ్ లీడర్‌ల మొదటి వర్చువల్ మీటింగ్, సెప్టెంబరు 2021లో వాషింగ్టన్ D.Cలో పర్సన్ సమ్మిట్, మార్చి 2022లో వర్చువల్ మీటింగ్ తర్వాత నాల్గో ఇంటరాక్షన్ ఇది.