Karnataka Road Accident: కర్ణాటకలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు, లారీ ఢీకొనడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో 7 మంది మరణించగా, 26 మంది గాయపడ్డారు. కర్ణాటకలోని హుబ్లీ శివారు ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి.
అసలేం జరిగిందంటే..
కొందరు బస్సులో కొల్హాపూర్ నుంచి బెంగళూరుకు బయలుదేరారు. హుబ్లి సమీపానికి బస్సు రాగానే లారీని, బస్సు ఢీకొట్టింది. ముందు వెళ్తున్న లారీనీ ఒవర్‌టెక్ చేయబోతున్న క్రమంలో లారీని ఢీకొట్టడంతో 6 మంది అక్కడికక్కడే చనిపోగా, ఆసుపత్రికి తరలిస్తుంటే మరో వ్యక్తి చనిపోయారు. బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 26 మంది గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం హుబ్లి లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం..
బస్సు, లారీ ప్రమాదంపై మంగళవారం తెల్లవారుజామున సమాచారం అందుకున్న పోలీసులు వెంటే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఒవర్‌టెక్ చేసే ప్రయత్నంలో బస్సు డ్రైవర్ లారీని ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు. లారీ ధర్వాడ్ వైపు వెళ్తోందని తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం..
బస్సు, లారీని ఢీకొట్టిన ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు దుర్మరణం చెందారు. గాయపడ్డ మిగతా ప్రయాణికులకు మెరుగైన వైద్యం అందించాలని స్థానిక నేతలు అధికారులను కోరారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
యూపీలోనూ ఇలాంటి ప్రమాదం
యూపీలోని బులంద్ షహర్‌లోనూ ఇలాంటి దారుణ రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా 5 మంది మరణించారు. గత రెండు రోజుల్లోనూ కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగి రోడ్లు నెత్తురోడుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం, రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు.
Also Read: Tirupati: పీకలదాకా తాగి పోలీసులు వీరంగం, భయపడి 100కి కాల్ చేసిన స్థానికుడు - తరువాత ఏం జరిగిందంటే !
Also Read: YS Jagan Davos Tour: దావోస్‌లో ఏపీ ధగధగలు, హై ఎండ్ టెక్నాలజీ హబ్‌గా విశాఖ - రెండోరోజు హైలైట్స్ ఇవే