తిరుపతి : ప్రజలకు రక్షణ కల్పించేందుకు, సమాజంలో చెడుని నిర్మూలించేందుకు పోలీసులు తమ విధులను నిర్వర్తిస్తుంటారు. అందుకు వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. ఎక్కడైనా అపాయం కానీ, గొడవలు గానీ జరిగితే ముందుగా పోలీసులకు ఫోన్ చేస్తే ఆ సమస్య పరిష్కరం అవుతుందని ప్రజలు నమ్ముతారు. కానీ చెడును అరికట్టాల్సిన పోలీసులే పీకలదాకా మద్యం సేవించి వీధి గూండాలుగా మారి ప్రజలను భయాందోళనకు గురి చేసిన ఘటన తిరుపతి జిల్లాలో ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఆ వివరాలిలా ఉన్నాయి.. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం పరిధిలో కళ్యాణ డ్యాం వద్ద గల పోలీసు ట్రైనింగ్ సెంటర్‌లో పోలీసు సిబ్బందికి వివిధ అంశాలపై ట్రైనింగ్ ఇస్తోంటి పోలీసు శాఖ. ఈ ట్రైనింగ్ సెంటర్ జూనియర్ అసిస్టెంట్ సిద్దారెడ్డి, సీనియర్ అసిస్టెంట్లు, చిట్టిబాబు, బాలాజీ, అడ్మిన్ మధుబాబు, టైపిస్టు గురుస్వామి, ఏఆర్ ఎస్ఐ శేషాద్రి, ఫార్మాసిస్ట్ బాలారాజు, అటెండర్ కోటేశ్వరరాజులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు చాలాకాలం నుంచి ట్రైనింగ్ సెంటర్ లో విధులు నిర్వర్తిస్తుండటంతో స్నేహితులు అయ్యారు. ఈక్రమంలోనే ఫార్మాసిస్ట్ గా పనిచేసే బాలరాజు తన కుమారుడికి ఐఐటీలో సీటు రావడంతో తమ స్నేహితులకు వీకెండ్ పార్టి ఇవ్వాలని అనుకున్నాడు.
ఐఐటీలో సీటు వచ్చిందని పార్టీ..
విధులు ముగించుకున్న అనంతరం బాలరాజు నివాసంలో పార్టి చేసుకోవాలి అనుకున్నారు. మద్యం, మాంసం వివిధ రకాల ఆహార పదార్ధాలను సమకూర్చుకున్నారు. దాదాపు 8 మంది తిరుపతిలో బాలరాజు నివాసం ఉండే ఉపాధ్యాయనగర్ కు వెళ్లి పార్టీ చేసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమోగానీ అటెండర్ కోటేశ్వరరాజు, సిద్దారెడ్డిల మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. వీరిద్దరిని ఆపేందుకు తోటివారు ప్రయత్నం చేసినా అదుపు చేయలేకపోయారు. బాలరాజు ఇంటి నుండి కోటేశ్వరరాజు మరో ముగ్గురిని తీసుకుని బయటకు వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న సిద్దారెడ్డి,పెట్రోల్ బంక్ వద్ద కోటేశ్వరరాజును అడ్డగించి గొడవకు దిగ్గాడు.
డయల్ 100కి కాల్ చేసిన స్థానికుడు
పోలీసులు అయిన వీరిద్దరూ గొడవ పడుతూ గెట్టిగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న ఓ వ్యక్తి డయల్ 100 కి కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అలిపిరి పోలీసులు చేరుకోవడంతో ఆరు మంది పరారయ్యారు. తాము బాధ్యత గల పోలీసులమని మరిచి గొడవ పడితున్న సిద్దారెడ్డి, కోటేశ్వరరాజుని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ వెంకటరామిరెడ్డికి తెలియజేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ప్రిన్సిపాల్ వెంకటరామిరెడ్డి ఎనిమిది మందికి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు. వీధిలో కేకలు వేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేసిన కోటేశ్వరరావు, సిద్దారెడ్డిపై కేసు నమోదు చేయాలని అలిపరి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వీరిద్దరిపై కేసు నమోదు చేసిన అలిపిరి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో న్యూసెన్స్ క్రియేట్ చేసిన సిద్ధారెడ్డి, కోటేశ్వర రాజులపై పోలీసు శాఖ శాఖాపరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Also Read: YS Jagan Davos Tour: దావోస్‌లో ఏపీ ధగధగలు, హై ఎండ్ టెక్నాలజీ హబ్‌గా విశాఖ - రెండోరోజు హైలైట్స్ ఇవే
Also Read: KTR Jagan Meet: దావోస్‌లో అరుదైన కలయిక, ఒకే ఫ్రేములో డైనమిక్ లీడర్స్