Mumbai: మహారాష్ట్రలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. రసాయనాల లోడ్ తో వెళ్తున్న ట్యాంకర్ మంటల్లో చిక్కుకుంది. కెమికల్ లోడ్ కావడంతో చూస్తుండగానే మంటలు విపరీతంగా వ్యాపించాయి. అనంతరం భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో కెమికల్ పార్టికల్స్ చెల్లాచెదురుగా పడిపోయాయి. దీని వల్ల ప్రమాద తీవ్రత మరింతగా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. 


మరణించిన వారిలో ఇద్దరు వ్యక్తులు ఇతర వాహనాలపై వస్తున్న వాహనదారులేనని అధికారులు చెబుతున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో మరో నలుగురు వ్యక్తులు కూడా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ట్యాంకర్ లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఉన్నారు. అదే వాహనంలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలు కాగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు లోనావాలా పోలీస్ స్టేషన్ కు చెందిన ఓ అధికారి తెలిపారు. 


విచారం వ్యక్తం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్


అగ్ని ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం పట్ల మాహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని దేవంద్ర ఫడ్నవీస్ సోషల్ మీడియా ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు. 






భారీ వాహనాల నిలిపివేత, కార్ల దారి మళ్లింపు


ప్రమాద ఘటన గురించి తెలియగానే హుటాహుటినా అధికారులు, రాష్ట్ర పోలీసులు, హైవే పోలీసులు, ఐఎన్ఎస్ శివాజీ సిబ్బంది, అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం హైవేకి ఒక వైపు ట్రాఫిక్ ను పునురుద్ధరించారు. ప్రమాదం జరిగిన వైపు.. ఆ ట్యాంకర్ ను తొలగించే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. 


కెమికల్ లోడ్ తో వెళ్తున్న ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడిందని, ఆ రాపిడికి డీజిల్ ట్యాంక్ నుండి ఇంధనం లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు పుణె రూరల్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుల మితేష్ ఘట్టే తెలిపారు. ఈ ప్రమాదం వల్ల బ్రిడ్జి కింద స్కూటర్ పై వెళ్తున్న ఒక మహిళ, ఆమె ఇద్దరు పిల్లలకు తీవ్ర కాలిన గాయాలయ్యాయని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న తెలిపారు. ప్రమాదం నేపథ్యంలో ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రయాణించే భారీ వాహనాలను ఖలాపూర్ టోల్ ప్లాజా, ఉర్సే టోల్ ప్లాజా వద్ద ఆపేసినట్లు హైవే సేఫ్టీ పెట్రోల్ (హెచ్ఎస్‌పీ) అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ సుమయ్య బగ్వాన్ తెలిపారు. కార్లను లోనావాలా ఎగ్జిట్ నుంచి పుణే- ముంబై హైవే మీదుగా మళ్లించినట్లు వెల్లడించారు.