Artificial Inteligence: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(Artificial Inteligence-AI).. ప్రపంచాన్ని(World) త్వరలోనే చుట్టేస్తుందన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. భారత్(India)లో అయితే.. మరో మూడేళ్ల(Three years)లో ఏఐ(AI) ఆధారిత వ్యాపారం.. ఆర్థిక వృద్ధి కూడా పెరుగు తున్నాయని ఇటీవలే సమాచారం తెరమీదికి వచ్చింది. అయితే.. ఇదే ఏఐ ఆధారిత టూల్స్ ఎంత వరకు మేలు చేస్తాయనేదే చర్చనీయాంశంగానే ఉన్నప్పటికీ.. వీటి వల్ల డీప్ ఫేక్(Deep fake) వీడియో(Vedios)లు సహా.. అనేక వివాదాస్పద అంశలు మాత్రం తెరమీదికి వస్తున్నాయి. డీప్ ఫేక్ వీడియోలు అయితే.. అమెరికా(America)లో కూడా కలకలం సృష్టించాయి. అక్కడ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(jeo biden) మాట్లాడినట్టుగా ఓ వాయిస్‌ను ఏఐతో సృష్టించి ప్రచారంలోకి తీసుకువచ్చారు. దీనిలో తనకు ఓటు వేయొద్దని.. తాను ఈ దేశానికి ఏమీ చేయలేకపోయానని బైడెన్ అన్నట్టుగా ఉంది. ఇది తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది.
ఇక, భారత్ వంతు!
భారత్‌లోనూ ఏఐ(AI) ఆధారిత డీప్ ఫేక్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. సినీ నటుల డీప్ ఫేక్ వీడియోలు, చిత్రాలు కొన్నాళ్ల కిందట చర్చకు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra modi) కొందరు మహిళలతో గార్భా నృత్యాలు చేసినట్టు కూడా ఫేక్ వీడియోలు ప్రచారంలోకివచ్చాయి. ఇప్పుడు తాజాగా రూపొందించిన ఏఐ ఆధారిత టూల్ ఒకటి మరింత రచ్చ చేసింది. ప్రధాని మోడీని తీవ్ర పదంతో వ్యాఖ్యానించడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి ప్రధాని నరేంద్ర మోడీని ఎవరు ఏమన్నా.. బీజేపీ నేతలు ఊరుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా విదేశీ సంస్థలకు చెందిన మీడియా సహా సాంకేతిక వ్యవస్థ ఏదైనా కూడా.. ప్రధాని మోడీపై అనుచితంగా చిన్న కామెంట్ పెట్టినా.. నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది గుజరాత్(Gujarat)లోని గోద్రా(Godra) ఘటనలపై బీబీసీ(BBC) రూపొందించిన డాక్యుమెంటరీలో మోడీని వివాదాస్పదంగా చూపించడంతో ఆ డాక్యుమెంటరీపై దేశవ్యాప్తంగా నిషేధం విధించింది. బీబీసీకి నోటీసులు కూడా పంపించింది. ఇక, చాటు మాటుగా దానిని చూసిన కొందరు విద్యార్థులపై కేసులు పెట్టింది.
తాజాగా ఏం జరిగిందంటే..
ఇలాంటి పరిస్థితితో తాజాగా నెట్ దిగ్గజం `గూగుల్`(Google) కూడా మోడీ(Modi) వివాదంలో చిక్కుకుంది. ఈ సంస్థ రూపొందించిన కృత్రిమ మేథ(Artificial Inteligence)-ఏఐ.. టూల్ `జెమినీ`(Gemini) ఆ సంస్థ కొంపముంచే పనిచేసింది. నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi)ని టార్గెట్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ వివాదం తీవ్రస్థాయికి చేరుతోంది. గూగుల్ ఇప్పటికే క్షమాపణలు చెప్పినా.. ఎన్నికలకు ముందు ఈ ఘటన చోటు చేసుకోవడంతో కేంద్రం ఊరుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పడం గమనార్హం. గూగుల్ రూపొందించిన అడ్వాన్స్‌డ్ వెర్షన్ ఏఐ టూల్ .. జెమినీ. ఇది నెటిజన్లు అడిగే అనేక ప్రశ్నలకు వెంటనే సెకన్ల వ్యవధిలో సమాధానం చెబుతుంది. ఇలా.. ఓ నెటిజన్ జెమినీని ఉద్దేశించి.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ప్రశ్న అడిగాడు. ``ప్రధాని మోడీ ఫాసిస్టా?’`(నియంత) అని ఓ నెటిజన్ అడిగాడు. దీనికి `జెమిని` ఏఐ అనుచిత సమాధానం ఇచ్చింది. ఇదే ప్రశ్నను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ గురించి అడిగితే మాత్రం.. ‘కచ్చితంగా, స్పష్టంగా చెప్పలేం’ అంటూ దాటవేత ధోరణిలో జవాబిచ్చింది. అంతే ఇది సోషల్ మీడియాలో నిముషాల వ్యవధిలో వైరల్ అవడంతో గూగుల్ పక్షపాతంగా పని చేస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. రంగంలోకి దిగిన కేంద్రం దీనిని తీవ్రంగా పరిగణించింది. ఇది ఐటీ చట్టం, క్రిమినల్ కోడ్ నిబంధనల ఉల్లంఘనే అని, దీనిపై చర్యలు తప్పవంటూ ఐటీ శాఖ మంత్రి హెచ్చరించారు.
వివరణ ఇదీ..
కేంద్రం ఆగ్రహంతో గూగుల్ కూడా వెంటనే రియాక్ట్ అయింది. సమకాలీన, రాజకీయ అంశాలకు సంబంధించి తమ చాట్‌బాట్ అన్నిసార్లు నమ్మదగిన సమాధానాన్ని ఇవ్వకపోవచ్చని తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు మేం త్వరితగతిన చర్యలు చేపట్టామని, ‘జెమిని’ని మేం ఓ సృజనాత్మక టూల్‌గా అభివృద్ధి చేశామని తెలిపింది. ఈ విషయంలో జమిని ఏఐను మరింత కచ్చితత్వంతో పనిచేసేలా అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని వివరణ ఇచ్చింది. కాగా.. గూగుల్ ఇచ్చిన వివరణపై కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ కారణాలతో చట్టాల నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ‘‘కచ్చితత్వం లేని వేదికలు, అల్గారిథమ్ లపై మా డిజిటల్ యూజర్లతో ప్రయోగాలు చేయకూడదు. యూజర్లకు డేటా భద్రత, విశ్వసనీయమైన సేవలు అందించడం మాధ్యమాల చట్టపరమైన బాధ్యత. ఇలాంటి కారణాలతో చట్టాల నుంచి మినహాయింపు పొందలేరు’’ అని హెచ్చరించారు. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.