ముంబై: సాధారణంగా మనకు కావాల్సిన సర్వీసు కోసం ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తుంటాం. అయితే మీకు పలనా వస్తువు లేక సర్వీసు కావాలంటే టెన్షన్ పడవద్దు. కేవలం ఇంటి నుంచే మీ వివరాలు పంపి, ఆన్ లైన్ పేమెంట్ చేస్తే సరిపోతుందని లింక్స్ మొబైల్‌కు వస్తుంటాయి. మీకు అవగాహనా లేకున్నా, నిర్ధారిత లింక్ కాదని తెలిసినా వాటి మీద క్లిక్ చేయవద్దు. పొరపాటున ఆ లింక్ క్లిక్ చేసి స్కామర్స్ అడిగిన వివరాలు ఎంటర్ చేశారంటే.. వాళ్లు మీ బ్యాంక్ ఖాతా ఖాళీ చేసే ప్రమాదం ఉంది. ఇటీవల ముంబైలో ఇలాంటి ఘటనే జరిగింది. ముంబైకి చెందిన వృద్ధురాలు ఒక లింక్‌ను క్లిక్ చేసిన తర్వాత ఏకంగా ₹18.5 లక్షలను కోల్పోయింది. ఆ మహిళ చేసిన పొరపాటు ఏంటి, ఎలా మోసం చేశారో పోలీసులు శనివారం తెలిపారు.
మిల్క్ ఆర్డర్ పేరుతో భారీ స్కామ్
వాడాలాకు చెందిన 71 ఏళ్ల వృద్ధురాలికి “దీపక్” అనే వ్యక్తి ఆగస్టు 4న ఫోన్ చేశాడు. అతను తాను పాలు ఆర్డర్ చేసే కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ అని పరిచయం చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. దీపక్ ఆమెకు ఒక లింక్‌ను పంపించి, ఆర్డర్‌ను పూర్తి చేయడానికి తన వివరాలను ఫిల్ చేయాలని సూచించాడు. ఆమె దాదాపు గంటపాటు అతనితో ఫోన్‌లో మాట్లాడుతూ అతని సూచనలు పాటించి వివరాలు సబ్మిట్ చేసింది. మరుసటి రోజు, దీపక్ మళ్లీ ఫోన్ చేసి మరికొంత సమాచారం అడిగాడు.
కొన్ని రోజుల తరువాత, తన మూడు బ్యాంకు ఖాతాలలో ఉన్న మొత్తం పొదుపు ₹18.5 లక్షలు ఖాళీ అయినట్లు పెద్దావిడ గుర్తించింది. ఆమె కొన్ని రోజుల కిందట లింక్‌ను క్లిక్ చేసి తన వివరాలను నమోదు చేసిన విషయం గుర్తుకొచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిందితులు ఆమె ఫోన్ నెంబర్, వివరాల ద్వారా బ్యాంక్ ఖాతాలకు యాక్సెస్ పొందారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భారతదేశంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కొందరు బ్యాంకు ఉద్యోగులం అని, మరికొందరు మీకు లాటరీ తగిలిందని, కారు గెలుచుకున్నారని రకరకాలుగా కాల్స్ చేసి సైబర్ మోసాలు చేస్తున్నారు. ఇక్కడ మిల్క్ ఆర్డర్ చేయడానికి ఫాం నింపాలని సూచించి ఆమె బ్యాంకు, ఆధార్ లాంటి వాటితో పాటు పిన్ వివరాలు సేకరించిన నిందితుడు బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు ఖాళీ చేశాడు.
ఈ నెలలోనే పూణేకు చెందిన ఒక వ్యాపారవేత్త పోలీసు అధికారులుగా నిటిస్తూ కొందరు మోసగాళ్లు చేసిన కారణంగా ఏకంగా ₹2.3 కోట్లు కోల్పోయాడు. మరో కేసులో, బెంగళూరుకు చెందిన సీనియర్ సిటిజన్‌లను నకిలీ KYC అప్‌డేట్ సందేశాల ద్వారా చీట్ చేశారు.
అలాంటి లింక్స్ క్లిక్ చేయవద్దు..
మీకు అవగాహన లేని, అపరిచిత వ్యక్తులు పంపిన లింక్‌లను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను షేర్ చేయవద్దని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. ధృవీకరించని సోర్స్ నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు వివరాలు, బ్యాంక్ అకౌంట్, ఆధార్ , పాన్ కార్డ్ వివరాలు ఫోన్ చేసిన వారికి చెప్పవద్దని అధికారులు పదేపదే ప్రజలను కోరుతున్నారు.