Manipur Violence: గత 3 నెలలుగా జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్ లో దర్యాప్తు, పరిష్కార చర్యలు, పరిహారం, పునరావాసాన్ని పర్యవేక్షించడానికి సుప్రీం కోర్టు ప్రత్యేక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. ముగ్గురు మాజీ మహిళా హైకోర్టు న్యాయమూర్తుల కమిటీని సుప్రీం కోర్టు సోమవారం నియమించింది. దర్యాప్తు సంస్థ నమోదు చేసిన 11 ఎఫ్ఐఆర్‌లపై సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించేందుకు ముంబయి మాజీ పోలీసు కమిషనర్ దత్తాత్రయ్ పద్‌సాల్గికర్‌ను సుప్రీం కోర్టు నియమించింది.


మే నెలలో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసుతో సహా మణిపూర్ హింసాకాండకు సంబంధించిన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు ధర్మాసనం సోమవారం రోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రత్యేక ప్యానెల్ ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ ప్యానెల్ లో జస్టిస్ గీతా మిట్టల్ (జమ్మూ & కశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ షాలినీ ఫన్సాలార్ జోషి (బాంబే హెచ్సీ మాజీ న్యాయమూర్తి), జస్టిస్ ఆశా మీనన్ (ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి) లు ఈ ప్యానెల్ ఉంటారు. ఈ ప్యానెల్ కు జస్టిస్ గీత మిట్టల్ నేతృత్వం వహిస్తారని స్పష్టం చేసింది. మణిపూర్ లో శాంతిభద్రతలను పునరుద్ధరించి, ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు.. విచారణలకు పరిశీలించడం, పరిష్కార చర్యలు సూచించడం, నష్టపరిహారం, పునరావాసం వంటి ఇతర అంశాలను సూచించే విస్తృత విధులను ఈ ప్యానెల్ నిర్వహిస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.


'సీబీఐని సుప్రీం కమిటీ భర్తీ చేయబోదు'


ఈ కమిటీ సీబీఐని భర్తీ చేయబోదని, అయితే చట్టబద్ధతపై విశ్వాసం ఉండేలా కమిటీని ఏర్పాటు చేస్తున్నామని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని బార్ అండ్ బెంచ్ నివేదించింది. అలాగే కేసుల విచారణను మణిపూర్ వెలుపలి రాష్ట్రానికి బదిలీ చేసేందుకు కోర్టు నిరాకరించింది. గత విచారణ సందర్భంగా ధర్మాసనం ముందు హాజరు కావాలని మణిపూర్ రాష్ట్ర డీజీపీ రాజీవి సింగ్ ను ఆదేశించగా.. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆయన హాజరయ్యారు. 


Also Read: Manipur Violence: మణిపూర్ బీజేపీ ప్రభుత్వానికి షాక్, సర్కారు నుంచి వైదొలిగిన కీలక పార్టీ


సుప్రీంకోర్టుకు రెండు వేర్వేరు నివేదికలు 


లైంగిక హింసకు సంబంధించిన 11 ఎఫ్ఐఆర్‌లను కేంద్రం సీబీఐకి అప్పగించిందని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ కేసులను సీబీఐకి బదిలీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేయకపోగా.. సీబీఐ బృందం లో కనీసం ఐదుగురు అధికారులు డిప్యూటీ ఎస్పీ లేదా ఎస్పీ హోదాలో ఉండాలని, వారిని వివిధ రాష్ట్రాల నుంచి తీసుకురావాలని కోర్టు ఆదేశించింది. వీరిని సీబీఐ, సీబీఐ జాయింట్ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. సీబీఐ దర్యాప్తును మహారాష్ట్ర మాజీ డీజీపీ, ఎన్ఐఏ అధికారి దత్తాత్రయ్ పద్‌సాల్గికర్ పరిశీలిస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది. జ్యూడిషియల్ కమిటీ, దత్తాత్రయ్ పద్‌సాల్గికర్ వేర్వేరు నివేదికలను అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించనున్నారు. సీబీఐకి బదిలీ చేయని కేసులను పరిశీలించేందుకు 42 సిట్ లు ఉంటాయని రాష్ట్ర దర్యాప్తుపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.