Manipur Violence: మణిపూర్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత మూడు నెలల నుంచి హింసాత్మక ఘటనలతో అట్టుడుకున్న మణిపూర్ లో బిరెన్ సింగ్ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయే సర్కారు నుంచి కుకీ పీపుల్స్ అలయెన్స్ పార్టీ బయటకు వచ్చేసింది. గత మూణ్నేళ్లుగా రావణకాష్టంలా మండుతున్న మణిపూర్ లో అల్లర్లను అదుపు చేయడంలో బిరెన్ సింగ్ ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ KPA పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంది. మొత్తం 60 మంది సభ్యులు ఉన్న మణిపూర్ అసెంబ్లీలో కుకీ పీపుల్స్ అలయెన్స్ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మేరకు కేపీఏ పార్టీ అధ్యక్షుడు టాంగ్ మాంగ్ హోకిప్ మణిపూర్ గవర్నర్ అనసూయ ఉయికేకు లేఖ రాశారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను కూలంకషంగా పరిశీలించిన తర్వాత బిరెన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు కొనసాగించడం సాధ్యం కాదని పార్టీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నామని,  ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని గవర్నర్ కు రాసిన లేఖలో కేపీఏ పార్టీ పేర్కొంది. 


జులై 18వ తేదీన ఢిల్లీలో జరిగిన ఎన్డీయే మిత్రపక్షాల సమావేశానికి కేపీఏ నాయకులు హాజరయ్యారు. మొత్తం మణిపూర్ అసెంబ్లీలో 60 స్థానాలు ఉండగా, బీజేపీకి సొంతంగా 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే ఇద్దరు ఎమ్మెల్యేలు గల కేపీఏ పార్టీ, ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న నాగా పీపుల్స్ ఫ్రంట్ పార్టీ, మరో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. అలా మొత్తం 60 సీట్ల మణిపూర్ అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వానికి 42 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. కేపీఏ పార్టీ తీసుకున్న తాజా నిర్ణయంతో బీజేపీ బలం 40కు పరిమితం అయింది. కాగా, ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు సహా 10 మంది కుకీల ప్రాబల్యం ఉన్న జిల్లాలతో ప్రత్యేక పాలనా యంత్రాన్ని డిమాండ్ చేస్తున్నారు కుకీలు. 


శనివారం ముగ్గురు మైతేయి వర్గీయుల హత్య


మణిపూర్ లో మరోసారి హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని కేంద్ర బలగాలను మణిపూర్ కు పంపించింది. 800 మంది అదనపు కేంద్ర భద్రతా సిబ్బందిని శనివారం అర్ధరాత్రి మణిపూర్ కు పంపింది. స్థానిక అధికారుల సూచనల మేరకు వారు వివిధ జిల్లాలకు వెళ్లారు. కేంద్రం పంపించిన బలగాల్లో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ దళాలు ఉన్నాయి. శనివారం బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్టా ప్రాంతంలో దుండగులు జరిపిన కాల్పుల్లో మైతేయి వర్గానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి వేళ అందరూ నిద్రలో ఉన్నప్పుడు దుండగులు దాడులకు తెగబడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మైతేయ్ వర్గీయులు కుకీ వర్గానికి చెందిన ఇళ్లకు నిప్పు పెట్టారు.


Also Read: Singer Gaddar: పరిటాల, వంగపండుతో గద్దర్‌కు ఉన్న అనుబంధం ఏంటీ? విమానం ఎందుకు ఎక్కలేకపోయారు?


లూటీ చేసిన ఆయుధాలతో ఘోరం


శనివారం జరిగిన దాడులకు ఉపయోగించిన అటోమేటిక్ రైఫిళ్లు, మోర్టార్ షెల్ లు.. గురువారం బిష్ణుపూర్ జిల్లాలోని 2వ ఇండియా రిజర్వ్ బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్ ఆయుధశాల నుంచి లూటీ చేసినవిగా అధికారులు అనుమానిస్తున్నారు. తాజాగా పంపిన కేంద్ర బలగాలు.. ఇప్పటికే రాష్ట్రంలో పహారా కాస్తున్న 9 వేల మంది సిబ్బందితో కలిసి భద్రతా చర్యల్లో పాల్గోనున్నాయి. దాదాపు 10 వేల మంది సైనికులు కూడా మణిపూర్ లోని వివిధ ప్రాంతాల్లో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు.