Chandrayaan-3: చంద్రయాన్-3 స్పేస్‌క్రాఫ్ట్ మొదటిసారి చంద్రుని ఉపరితల చిత్రాలను పంపించింది. చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత మొదటిసారి చంద్రయాన్-3 జాబిలి చిత్రాలను తీసింది. ఈ చిత్రాలను ఇస్రో తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకుంది. శనివారం లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్ (LOI) తర్వాత చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్-3 మొదటిసారి జాబిలి ఉపరితలాన్ని తన కెమెరా ద్వారా బంధించింది. 'ఆగస్టు 5, 2023 రోజు చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించిన (Lunar Orbit Insertion) సమయంలో చంద్రయాన్-3 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిని తన కెమెరాల ద్వారా బంధించింది' అని ఇస్రో తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేసింది. చంద్రయాన్-3 మిషన్ ఇప్పటి వరకు ప్రణాళికబద్ధంగా, విజయవంతంగా ఒక్కో దశను దాటుకుంటూ తన లక్ష్యం వైపు సాగుతోంది. విక్రమ్ ల్యాండర్ ను ఈ నెల చివర్లో ఆగస్టు 23వ తేదీన చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయనున్నట్లు ఇస్రో వెల్లడించింది.
చంద్రయాన్-3 క్రమంగా జాబిలికి దగ్గరవుతోంది. ఒక్కో దశను పూర్తి చేసుకుంటూ తన లక్ష్యం దిశగా సాగుతోంది. దీర్ఘవృత్తాకర చంద్ర కక్ష్యలోకి చంద్రయాన్-3 ప్రవేశించిన ఒక రోజు తర్వాత.. ఆదివారం సాయంత్రం వేళ మరో విన్యాసాన్ని చేపట్టింది ఇస్రో. అపోల్యూన్ వద్ద 18,074 కిలోమీటర్ల నుంచి 4,313 కిలోమీటర్ల కక్ష్యలోకి మారింది. చంద్రయాన్-3 విజయవంతంగా ప్రణాళికాబద్ధంగా కక్ష్యను తగ్గించుకున్నట్లు ఇస్రో వెల్లడించింది. రెట్రో-ఫైరింగ్ తో చంద్రుని ఉపరితలానికి మరింత దగ్గరగా తీసుకెళ్లినట్లు పేర్కొంది. ప్రస్తుతం చంద్రయాన్-3 170కి.మీ X 4313 కి.మీ కక్ష్యలో తిరుగుతోంది. ఆగస్టు 9వ తేదీన చంద్రయాన్-3 కక్ష్యను మరింత తగ్గించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 1 - 2 గంటల మధ్య ఈ కక్ష్య మార్పు జరగనుంది.
Also Read: Singer Gaddar: పరిటాల, వంగపండుతో గద్దర్‌కు ఉన్న అనుబంధం ఏంటీ? విమానం ఎందుకు ఎక్కలేకపోయారు?
జులై 14వ తేదీన చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టగా.. ఇప్పటి వరకు 8 దశలను దాటుకుంది. జులై 15, 25 తేదీల మధ్య 5 భూకక్ష్యలను మార్చుకుంది. ఆగస్టు 1వ తేదీన ట్రాన్ లూనార్ ఇంజెక్షన్ విన్యాసాన్ని చేపట్టింది. దాదాపు 3.6 లక్షల కిలోమీటర్ల ఎత్తులో చంద్రుని వైపు కదిలింది. శనివారం చంద్రుని కక్ష్య(లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్)లోకి ప్రవేశించింది. ఆదివారం సాయంత్రం వేళ చంద్రునికి మరింత దగ్గరగా వెళ్లేందుకు మరో కక్ష్యను మార్చుకుంది. సాఫ్ట్ ల్యాండింగ్ కావడనికి చంద్రయాన్-3 మరో మూడు చంద్రుని కక్ష్యలను మార్చాల్సి ఉంటుంది. ల్యాండింగ్ మాడ్యూల్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయే ముందు, చంద్రయాన్-3 చంద్రుని చుట్టూ ఉన్న ప్రస్తుతం దీర్ఘవృత్తాకార కక్ష్య నుంచి 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి రావాల్సి ఉంటుంది. ల్యాండర్ విడిపోయిన తర్వాత, విక్రమ్ (ల్యాండర్), ప్రజ్ఞాన్ (రోవర్)ను చంద్రుని వైపు తీసుకెళ్తుంది. చంద్రుని చుట్టూ 100 కి.మీ X 30 కి.మీ కక్ష్యలోకి మారుతుంది. ఆగస్టు 23వ తేదీన సాయంత్రం 5.47 గంటలకు చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండ్ జరగనుంది.