Manipur Violence: మణిపూర్ లో మరోసారి హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని కేంద్ర బలగాలను మణిపూర్ కు పంపించింది. 800 మంది అదనపు కేంద్ర భద్రతా సిబ్బందిని శనివారం అర్ధరాత్రి మణిపూర్ కు పంపింది. స్థానిక అధికారుల సూచనల మేరకు వారు వివిధ జిల్లాలకు వెళ్లారు. కేంద్రం పంపించిన బలగాల్లో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ దళాలు ఉన్నాయి. శనివారం బిష్ణుపూర్ జిల్లాలోని క్వాక్టా ప్రాంతంలో దుండగులు జరిపిన కాల్పుల్లో మైతేయ్ వర్గానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి వేళ అందరూ నిద్రలో ఉన్నప్పుడు దుండగులు దాడులకు తెగబడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మైతేయ్ వర్గీయులు కుకీ వర్గానికి చెందిన ఇళ్లకు నిప్పు పెట్టారు. తీవ్ర ఘర్షణల నేపథ్యంలో.. ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు బీజేపీ మిత్రపక్షం కుకీ పీపుల్స్ అలయన్స్ (KPA) ప్రకటించింది.
అప్పుడు వద్దన్నారు.. ఇప్పుడు చేయమంటున్నారు
మణిపూర్ లో ఘర్షణలను అదుపులోకి తీసుకురావడంలో సీఎం బిరెన్ సింగ్ విఫలమవుతున్నారు. మణిపూర్ లో ఈనాటికీ పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడకపోడవంతో జూన్ లో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. గవర్నర్ అనుసూయ యూకీ అపాయింట్‌మెంట్ తీసుకుని రాజీనామా పత్రాలతో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సీఎం రాజీనామాను ఆయన అభిమానులు, కొన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆయన రాజీనామా చేయకుండా అడ్డుకుంటామని పెద్ద ఎత్తున బిరెన్ మద్దతుదారులు ఇంఫాల్ లోని సీఎం నివాసానికి వచ్చారు. సీఎం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి కోరారు. బిరెన్ తన నివాసం నుంచి బయటకు వచ్చి తన రాజీనామా పత్రాన్ని చదివి వినిపించారు. ఇంతలో ఇద్దరు మహిళలు బిరెన్ చేతిలో ఉన్న రాజీనామా లేఖను లాక్కొని ముక్కలుగా చించేశారు. అనంతరం బిరెన్ సింగ్ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
అయితే, అప్పుడు సీఎంగా రాజీనామా చేసేందుకు అడ్డుకున్న వారే.. ఇప్పుడు బిరెన్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా చెలరేగిన హింసాత్మక ఘటనలపై వారు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ముగ్గురు చనిపోవడం, మరో 16 మంది గాయపడటంపై ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. అస్సాం రైఫిల్స్ సిబ్బంది కాపలా ఉన్న గ్రామంలోకి దుండగులు ప్రవేశించి మైతేయ్ వర్గీయులను కాల్చి చంపడంపై కోకోమి నాయకుడు జితేంద్ర నింగోంబా మండిపడ్డారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Also Read: Singer Gaddar: పరిటాల, వంగపండుతో గద్దర్‌కు ఉన్న అనుబంధం ఏంటీ? విమానం ఎందుకు ఎక్కలేకపోయారు?
లూటీ చేసిన ఆయుధాలతో ఘోరం
శనివారం జరిగిన దాడులకు ఉపయోగించిన అటోమేటిక్ రైఫిళ్లు, మోర్టార్ షెల్ లు.. గురువారం బిష్ణుపూర్ జిల్లాలోని 2వ ఇండియా రిజర్వ్ బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్ ఆయుధశాల నుంచి లూటీ చేసినవిగా అధికారులు అనుమానిస్తున్నారు. తాజాగా పంపిన కేంద్ర బలగాలు.. ఇప్పటికే రాష్ట్రంలో పహారా కాస్తున్న 9 వేల మంది సిబ్బందితో కలిసి భద్రతా చర్యల్లో పాల్గోనున్నాయి. దాదాపు 10 వేల మంది సైనికులు కూడా మణిపూర్ లోని వివిధ ప్రాంతాల్లో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు.