Manipur Violence:


అందమైన రాష్ట్రంలో అలజడి..


22,327 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. 30 లక్షల మంది జనాభా. మూడు తెగల ప్రజలు. ఇదీ క్లుప్తంగా మణిపూర్‌. మణిపూర్ (Manipur) అంటే బంగారు భూమి అని అర్థం. ముత్యాల నేల అని కూడా అంటారు. అంత అందమైందీ ప్రాంతం. ఈ రాష్ట్రంలో మొత్తం 39 తెగలున్నాయి. వీరిలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఉన్నారు. ఇన్ని తెగలున్నప్పటికీ మెజార్టీ మాత్రం మైతేయి వర్గానిదే. 50%కిపైగా ఈ తెగ వాళ్లే ఉన్నారు. 43% మంది కుకీలు, నాగాలున్నారు. మైతేయిని మెజార్టీ కమ్యూనిటీ కాగా..కుకీలు, నాగాలు మైనార్టీలు. ఇప్పుడు గొడవ జరుగుతోంది మైతేయి, కుకీల మధ్య. మైతేయిలకు షెడ్యూల్ తెగ (ST)హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఎప్పుడైతే ప్రభుత్వానికి సూచించిందో అప్పటి నుంచి నిప్పు రాజుకుంది. అది క్రమంగా రాష్ట్రాన్ని మంటల్లోకి నెట్టేసింది.


ఇప్పుడు ST హోదా అనేది కేవలం ఓ కారణమే అయినా...మైతేయిలకు, కుకీలకు ఎప్పటి నుంచో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మైతేయి తెగ అధీనంలోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని కుకీలు చాలా గట్టిగా నమ్ముతున్నారు. ఇందులో నిజానిజాలెంత అన్నది పక్కన పెడితే వాళ్లలో ఈ ఆలోచన బలంగా నాటుకుపోయింది. తమపై వివక్ష చూపిస్తున్నారని మండిపడుతున్నారు కుకీలు. "మా భూములు బలవంతంగా లాక్కుంటున్నారు. మమ్మల్ని రాష్ట్రం నుంచి వెళ్లగొడుతున్నారు" అని పలు సందర్భాల్లో కుకీలు ఆందోళన వ్యక్తం చేశారు. కొండ ప్రాంతంలో కుకీలదే మెజార్టీ. అక్కడ మైతేయి వర్గ ఆధిపత్యాన్ని అసలు సహించరు కుకీలు. మైతేయిలకు ST హోదా వస్తే ఈ కొండ ప్రాంతాల్లోని భూములనూ కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. అంటే తమ "ఉనికి" కోల్పోతామని కుకీలకు భయం పట్టుకుంది. ఈ భయం నుంచే ఘర్షణ మొదలైంది. 


ఎవరికి వారే గొప్ప..!


మణిపూర్‌లోని ఇంఫాల్ వ్యాలీలో మైతేయి వర్గ ప్రజలు ఎక్కువగా ఉంటారు. "మణిపూర్ సంస్కృతిని కాపాడేది మేమే" అని చాలా గట్టిగా విశ్వసిస్తుంది ఈ తెగ. ఇక మైనార్టీలైన కుకీలు, నాగాలు ఎప్పుడూ అణిచివేతకు గురవుతూ వస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే ఆధిపత్యానికి, అణిచివేతకు మధ్య ఘర్షణ ఇది. కుకీలు, నాగాల మధ్య కూడా ఇదే గొడవ. 1993లో ఈ రెండు తెగల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఆ గొడవల్లో 115 మంది కుకీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ అంతర్గత పోరు 3 దశాబ్దాలుగా నడుస్తూనే ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. నార్త్ ఇంఫాల్‌ని నాగాలు డామినేట్ చేస్తున్నారు. ఇక కుకీలను చిన్ ట్రైబ్స్‌గానూ పిలుస్తారు. వీళ్ల సంస్కృతి మిజోరంలోని మిజో తెగకు దగ్గరగా ఉంటుంది. రాష్ట్రానికి నాగాలు, మైతేయిల కన్నా ఎక్కువ మొత్తంలో వలస వచ్చింది వీళ్లే. అంటే...వీళ్లను వలసవాదులుగానే చూస్తున్నాయి మైతేయి, నాగాల తెగలు. "రాష్ట్రం మాదే" అనే ఆలోచన అంత బలంగా పాతుకుపోవడానికి ఇది కూడా ఓ కారణం. 1949 నుంచి ఇక్కడ వేర్పాటువాదం మొదలైంది. 


నియంత్రణ కష్టమే..!


ఇక్కడి హింసను నియంత్రించేందుకు 1958లో Armed Forces Special Powers Act తీసుకొచ్చారు. పారామిలిటరీ బలగాలకు ఇక్కడి ఘర్షణలను కంట్రోల్ చేయడానికి అన్ని అధికారాలు ఇచ్చారు. అయితే...రైట్‌ వింగ్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్నో ఏళ్లుగా దీనిపై వాదనలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం వేర్పాటువాదాన్న అణిచివేయడం కోసమే ఈ చట్టం తీసుకొచ్చామని ప్రభుత్వాలు వివరించినా ఇది వివాదాస్పద చట్టంగానే మిగిలిపోయింది. అయినా...ఈ చట్టంతో అక్కడి హింస ఆగలేదు. ప్రతి వర్గానికీ ప్రత్యేకంగా సాయుధ బలగాలు తయారయ్యాయి. మానవ అక్రమ రవాణా పెరిగిపోయింది. క్రమంగా వీళ్లు రాజకీయాల్నీ శాసించడం మొదలు పెట్టారు. ఎన్నికల్లో బరిలోకి దిగిన అభ్యర్థులకు మద్దతునివ్వడం ప్రారంభించారు. తమ వర్గానికి చెందిన వాళ్లే ప్రభుత్వాన్ని శాసించాలనే ఆలోచన మొదలైంది. ఇలా...వర్గపోరు కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సినవి మూడు విషయాలు. 


1. తమపై మైనార్టీలు, వలసవాదులు అనే ముద్ర వేసి శాశ్వతంగా మైతేయిలు ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారన్న ఆందోళన నుంచి కుకీలు ఉద్యమించడం మొదలు పెట్టారు. 


2. అధికారంలో ఎవరున్నా తమ మాటే వినాలని డిమాండ్ చేస్తున్నారు మైతేయిలు. పైగా...నాగాల విషయంలోనూ వీళ్లు చాలా అసహనంతో ఉన్నారు. వేర్పాటువాదంతో మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాలపై వాళ్లు ఆధిపత్యం సాధిస్తారేమో అన్న ఆందోళన వాళ్లలో ఎప్పటి నుంచో ఉంది. అందుకే...ఎట్టి పరిస్థితుల్లోనూ నాగాల చేతికి అధికారం వెళ్లకూడదని గట్టిగా పోరాడుతున్నారు. 


3. కుకీలు ఎప్పటి నుంచో ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు.  Zale n Gam పేరుతో కుకీలందరినీ ఒక్కటి చేసే వాళ్లను వాళ్లే పరిపాలించుకునేలా చేయాలని పట్టుబడుతున్నారు. ఇదే జరిగితే..మణిపూర్‌లోని కొన్ని ప్రాంతాలను వాళ్ల భూమిలో కలిపేసుకుంటారని నాగాలు, మైతేయిలు ఆందోళన పడుతున్నారు. 


NRC తంటా..


ఈ మూడు విషయాలతో పాటు మరో కీలక అంశం కూడా ఉంది. అదే National Register for Citizens (NRC). మణిపూర్‌లో NRC కచ్చితంగా అమలు చేయాలని మైతేయిలు, నాగాలు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ల టార్గెట్ అంతా కుకీలే. వీళ్లను వలసవాదులుగా పరిగణిస్తున్న మైతేయిలు, నాగాలు ఏదో విధంగా రాష్ట్రం నుంచి వాళ్లను తరిమేయాలని చూస్తున్నారు. అంతే కాదు. చిన్ తెగకు చెందిన ప్రజలను రహస్యంగా తమ ప్రాంతంలోకి రప్పించుకుని వాళ్లలో కలిపేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా అక్రమ వలసల్ని ఆపాలంటే కచ్చితంగా NRC అమలు చేయాలన డిమాండ్ చేస్తున్నారు. ఈ ఒక్క విషయంలోనూ కలిసి పోరాటం చేస్తున్నారు మైతేయిలు, నాగాలు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కుకీలు ఉన్న ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టింది. అక్కడి భూముల్ని రిజర్వ్‌డ్ ఫారెస్ట్ ఏరియాలు గుర్తించింది. కుకీలు అక్కడి నుంచి బలవంతంగా వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ తరవాత కుకీలకు చెందిన ట్రైబల్ కాలనీలో ఓ చర్చ్‌ని కూలగొట్టారు. దీంతో ఒక్కసారి కుకీ వర్గం భగ్గుమంది. ఆ మంటకు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆజ్యం పోసింది. 


Also Read: బెంగాల్‌లోనూ మణిపూర్ తరహా దారుణం,చోరీ చేశారన్న కోపంతో మహిళలపై దాడి - అర్ధనగ్నంగా ఊరేగింపు