Malda Viral Video: 



మల్దాలో ఘటన..


మణిపూర్‌ వైరల్ వీడియోపై దేశమంతా భగ్గుమంటోంది. ఈ ఘటనపై విచారణ జరుగుతుండగానే ఇలాంటి దారుణమే మరోటి వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌లోని మల్దాలో ఇద్దరు మహిళలను అర్ధ నగ్నంగా రోడ్డుపై తిప్పుతూ దాడి చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం మూడు నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. దొంగతనం చేశారన్న అనుమానంతో ఇద్దరు మహిళలపై దాడి చేసిన స్థానికులు...తరవాత వాళ్లను అర్ధనగ్నంగా రోడ్లపై ఊరేగించారు. మహిళలు కూడా వాళ్లపై దాడి చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇంత జరిగినా ఎవరూ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వలేదు. ఈ వీడియో తమ వద్దకు వచ్చే వరకూ అసలు అలాంటి ఘటన జరిగినట్టు సమాచారం లేదని వెల్లడించారు. వీడియో ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు...కీలక విషయాలు వెల్లడించారు. దొంగతనం చేస్తూ ఇద్దరు మహిళలు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుపడ్డారని, స్థానిక మహిళలు వాళ్లను దారుణంగా కొట్టారని చెప్పారు. ఈ ఇద్దరిపై దాడి చేసిన వాళ్లు కూడా పోలీస్ కంప్లెయింట్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. విషయమంతా తెలిస్తే తమపైనా చర్యలు తీసుకుంటారని భయపడ్డారు. 


"మల్దాలోని పకుహట్‌లో నాలుగు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఇద్దరు మహిళలు దొంగతనం చేస్తుండగా స్థానిక వ్యాపారులు వాళ్లను పట్టుకున్నారు. మహిళలే వాళ్లను రోడ్డుపైకి తీసుకొచ్చి కొట్టారు. ఆ తరవాత ఇద్దరు బాధితులూ అక్కడి నుంచి పారిపోయారు. మాకు ఫిర్యాదు కూడా చేయలేదు"


- పోలీసులు 


మణిపూర్‌లో ఘోరం..


మణిపూర్‌లో దిగ్భ్రాంతికర ఘటనలో ఓ బాధిత మహిళ భర్త ఆర్మీలో పని చేశారు. అప్పటి ఘటనపై స్పందించిన ఆర్మీ జవాను.. తాను సైనికుడిగా కార్గిల్ యుద్ధంలో పోరాడానని, శ్రీలంకలో పీస్ కీప్ దళంలో పని చేశానని.. అలాంటిది భార్యను కాపాడుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు అల్లరి మూక తమపైకి జంతువుల్లా ఎగబడ్డారని చెప్పారు. ఆయుధాలతో బెదిరించారని అన్నారు. భారత సైనికుడికి జరిగిన ఈ ఘోరాన్ని చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు అక్కడే ఉన్నా ఏమీ చేయలేదని చెప్పుకొచ్చారు. ఇలాంటి అమానుష ఘటనలు మరిన్ని జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తమ ఊరు యుద్ధభూమి కంటే ప్రమాదకరంగా ఉందని చెప్పాడు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. ఇరు వర్గాల మధ్య పోరులో అల్లరి మూకలు ఓ గ్రామంపై ఎగబడ్డాయి. ఈ క్రమంలో తప్పించుకుంటున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలపై ఆందోళనకారులు అమానవీయంగా ప్రవర్తించారు. బాధితుల్లో 50 ఏళ్ల వ్యక్తి, అతడి 19 ఏళ్ల కుమారుడు , 21 ఏళ్ల కుమార్తె, 52, 42 ఏళ్ల ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వారిపై అల్లరి మూక దాడి చేయగా.. వారు పరుగన వెళ్లి సమీప పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దాదాపు 800 నుంచి 1000 మంది ఉన్న భారీ గుంపు పోలీసుల నుంచి వారిని లాక్కెళ్లారు. ఈ క్రమంలో 21 ఏళ్ల యువతిని గుంపులోని వారు లాక్కెళ్తుండగా.. 19 ఏళ్ల యువకుడు అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. గుంపులో ఆయుధాలు కలిగి ఉన్న వ్యక్తులు అతడిపై దాడి చేసి అక్కడికక్కడే హతమార్చారు.


Also Read: గ్యాంగ్‌ స్పూర్తితో ఏసీబీ రైడ్స్‌- 100 మంది అధికారులను మోసం చేసిన కేటుగాడు