టమాటా ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నప్పటికీ కొందరు రైతుల మోహాల్లో మాత్రం ఆనందం వెల్లివిరుస్తోంది. ఎక్కడెక్కడో రైతులు కోట్లు సంపాదించారని చాలా వార్తలు వచ్చాయి. ఇప్పుడు మాత్రం తెలుగు రైతే ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. 


మెదక్‌లోని కౌడిపల్లి గ్రామానికి చెందిన మహిపాల్‌రెడ్డి జూన్‌ 15 నుంచి నెల రోజుల పాటు టమాటాలు అమ్మి కోటీ 80 లక్షలు సంపాదించారు. చదువు అబ్బకపోవడంతో ఆయన రైతుగా సెటిల్ అయ్యారు. చదువును పదోతరగతిలోనే అపేశారు. మొదట్లో వరి సాగు చేసే మహిపాల్‌ అందులో నష్టాలనే చూశారు. 


వరి సాగుతో లాభం లేదని గ్రహించి కూరగాయలు సాగు వైపు మొగ్గు చూపారు. ఇన్నాళ్లు పడిన శ్రమకు ఇప్పుడు ఫలితం లభించింది. నెల రోజులుగా పెరిగిపోతున్న టమాలా ధర కారణంగా మహిపాల్ పంట పండింది. దాదాపు 150 రూపాయలు పలుకుతున్న టమాటను విక్రయించి మంచి లాభాలను తెచుకున్నారు. 


మహిపాల్‌ సుమారు 8 ఎకరాల్లో టమాటా పంట పండించారు. జూన్‌ 15 నుంచి వచ్చిన దిగుబడిని అమ్ముతున్నారు. నెల రోజుల్లో కోటీ ఎనభై లక్షల రూపాయల సరకు అమ్మారు. 


వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ భూసారానికి అనుగుణంగా పంట మార్పిడీ చేస్తున్నట్టు మహిపాల్ తెలిపారు. అందుకే తన పొలంలో పండిన టమాట ఏ గ్రేడ్‌ రకానికి చెందిందని చెబుతున్నారు. అధిక వర్షాలకు కాస్త పంట నష్టం వాటిల్లిందన్నారు. అయితే ఇప్పటి వరకు 60 శాతం పంటనే అమ్మానని.. ఇంకా 40 శాతం పంట పొలంలోనే ఉందన్నారు. మిగతా 40 శాతం దిగుబడి అమ్మితే కచ్చితంగా తన ఆదాయం 2 కోట్లకు దాటిపోతుందన్నారు. 


మహిపాల్ రెడ్డి వద్ద దాదాపు వంద ఎకరాల భూమి ఉంది. నాలుగేళ్ల నుంచి 40పైగా ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు. మిగిలిన వాటిలో వరి లాంటి పంటలు వేస్తున్నారు. వ్యవసాయంలో కంటిన్యూగా ప్రయత్నిస్తుంటేనే లాభాలు చూడవచ్చని అంటున్నారు. 


ఎకరాకు రూ. 2 లక్షలు పెట్టుబడి పెడతానని.. సీజన్‌ బాగుంటే కచ్చితంగా మంచి లాభాలు వస్తాయని పెట్టుబడి ఎటూ పోదని అంటున్నారు మహిపాల్‌. తాను ఇప్పటి వరకు 7,000 పెట్టెలకు పేగా టమాటాలను విక్రయించినట్టు తెలిపారు. ఒక్కోటి బాక్స్‌ 25 కిలోల కంటే ఎక్కువగా టమాటాలు ఉంటాయి. 


ఇప్పుడు వచ్చిన లాభాలతో వ్యవసాయంలో లేటెస్ట్ టెక్నాలజీని వాడుకోవడానికి ఉపయోగపడతాయని అంటున్నారు మహిపాల్. త్వరలోనే వ్యవసాయ పనుల కోసం డ్రోన్స్‌ వాడబోతున్నట్టు చెప్పారు. ఖర్చులు తగ్గించుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుందన్నారు. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial