సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన గ్యాంగ్ సినిమా గుర్తుందా. అందులో డబ్బులు అవసరాలు ఉన్న వ్యక్తులను ఒకచోట చేర్చి సీబీఐ అధికారుల్లా బిల్డప్ ఇస్తూ అక్రమాలు చేసే వారిని దోచుకుంటారు. అదే సినిమాన రియల్‌లైఫ్‌లో పోలీసులు చూపించాడో వ్యక్తి. అక్కడ సూర్య సీబీఐ అంటే ఇక్కడ ఈ వ్యక్తి మాత్రం ఏసీబీ అంటూ ఐడీ మెడలో వేసుకున్నాడు. అంతే అక్రమాలు చేసే అధికారులకు మూడు చెరువుల నీళ్లు తాగించాడు. 


అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారిగా నటించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని చాలా మంది ప్రభుత్వ అధికారులకు నిద్రలేకుండా చేశాడు 28 ఏళ్ల ఎన్‌ జయకృష్ణ. అతన్ని శంషాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గత ఏడాది కాలంలో తెలంగాణలోనే వివిధ స్థాయిల్లోని 100 మంది అధికారులను మోసం చేసి దాదాపు రూ.70 లక్షలు సంపాదించాడట. ఆంధ్రప్రదేశ్‌లో మరో రూ.30 లక్షలు సంపాదించినట్లు భావిస్తున్నారు. 


ఏసీబీ అధికారులమంటూ తానో ఓ గ్యాంగ్‌ను తయారు చేసుకున్నాడు. అవినీతి ఆరోపణలు ఉన్న అధికారుల లిస్ట్ తీసుకురావడం రైడ్ చేయడం వారి నుంచి ఫైన్‌ కింద డబ్బులు వసూలు చేయడం జయకృష్ణ పని. ఇతనికి ఫైన్స్‌ అయితే కడుతున్నారు కానీ... ఏసీబీ అధికారి ఖాతాకు డబ్బు చేరిందా లేదా అనేది మాత్రం ఎవరూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అందుకే ఇతని మోసం సజావుగా సాగిపోయింది. ఎప్పుడు ఫైన్స్ వేసినా నేరుగా ఎవరికీ ఇవ్వొద్దని ఆన్‌లైన్‌ చెల్లింపులే చేయాలంటూ హితబోధ చేసేవాడు. 


విపరీతమైన జల్సాలకు అలవాటు పడిన జయకృష్ణ అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టాడు. బెంగళూరు నివాసి అయిన జయకృష్ణ సంపాదించిన డబ్బును క్యాసినోల్లో, హై ఎండ్ పబ్‌ల్లో మద్యం సేవించడానికి వాడుకునేవాడు. గోవాలో పార్టీలకు హాజరయ్యేవాడు. హై ఎండ్‌ లైఫ్‌ను లీడ్ చేశాడని పోలీసులు తెలిపారు. 


జయకృష్ణ పోలీసు కావాలనుకున్నాడు. పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోయాడు. అందుకే తానే స్వయంగా ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇదంతా ఆయన 'గ్యాంగ్' సినిమా స్ఫూర్తితోనే ప్రభుత్వ అధికారులను మభ్యపెట్టాడు.


ఏసీబీ అధికారినంటూ జూన్, జూలైలో సిద్దిపేటలోని ఇద్దరు వేర్వేరు ప్రభుత్వ అధికారులను సంప్రదించాడు జయకృష్ణ. క్రిమినల్ కేసు లేకుండా సమస్యను పరిష్కరించుకోవాలంటే రూ.3 లక్షల వరకు చెల్లించాలని సిద్దిపేట జిల్లా పౌరసరఫరాల అధికారికి సూచించారు. చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులతోనూ ఇదే డిమాండ్‌ చేశారు.
తెలంగాణలో ఇప్పటి వరకు మూడు కేసులు నమోదయ్యాయి. ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారని పోలీసు అధికారులు చెబుతున్నా ఫిర్యాదు నమోదు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో శంషాబాద్‌లో సుమోటోగా కేసు నమోదు చేశారు. సిద్దిపేటలో ఇద్దరు అధికారులు కూడా భయపడి డబ్బులు చెల్లించారని పోలీసులు తెలిపారు.


కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా 34 కేసుల్లో జయకృష్ణ ప్రమేయం ఉంది. గతంలోనూ పలుమార్లు అరెస్టయ్యాడు. అతను మొదట చైన్ స్నాచర్‌గా తన నేర జీవితాన్ని ప్రారంభించాడు., 16 నేరాలకు పాల్పడ్డాడు. తరువాత శ్రీనాథ్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి పనిచేశాడు. ఈ మోసాలు నేర్పింది శ్రీనాథ్‌రెడ్డే.