Manipur Violence: 


ఎన్‌పీపీ నేత సంచలన వ్యాఖ్యలు..


మణిపూర్ సమస్యకి పరిష్కారం చూపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న సమయంలో మణిపూర్‌లో బీజేపీ మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) నేత ఎమ్ రామేశ్వర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ వలసదారులు,మిలిటెంట్స్‌పై సర్జికల్ స్ట్రైక్ చేయాలని అన్నారు. మూడు నెలులగా మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ అల్లర్లలో 150 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై పార్లమెంట్‌లోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై చర్చించాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ప్రధాని మోదీ మణిపూర్‌పై మాట్లాడారు. త్వరలోనే శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే...అంత సుదీర్ఘ ప్రసంగంలో మణిపూర్‌ గురించి మాట్లాడింది కాసేపే. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమస్య ఎలా పరిష్కరిస్తారో చెప్పకుండా విపక్షాలపై జోక్‌లు వేశారని రాహుల్ గాంధీ కూడా విమర్శించారు. ఈ క్రమంలోనే NPP నేత చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. 


"మణిపూర్‌ సరిహద్దు ప్రాంతంలో కుకీ వర్గానికి చెందిన మిలిటెంట్‌లు అక్రమంగా చొచ్చుకుని వచ్చి అల్లర్లు సృష్టిస్తున్నారు. హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యల్ని బట్టి ఇదే అర్థమవుతోంది. బయట నుంచి ఎవరో ఈ హింసకు ఆజ్యం పోస్తున్నారని నేను మొదటి నుంచి చెబుతున్నాను. జాతీయ భద్రత విషయంలో రాజీ పడొద్దు. కేవలం మణిపూర్‌నే కాదు. మొత్తం దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరముంది. సర్జికల్ స్ట్రైక్ లాంటి దాడులు చేసి మరీ హింసను అదుపులోకి తీసుకురావాలి"


- ఎమ్‌ రామేశ్వర్ సింగ్, NPP నేత


విదేశీ సంస్థల జోక్యం..


అమిత్‌షాతో ఇప్పటికే ఈ విషయమై చర్చించినట్టు వెల్లడించారు రామేశ్వర్ సింగ్. కుకీ మిలిటెంట్స్‌ క్యాంప్‌లలోనే ఉంటున్నారని, ఆయుధాలు స్వాధీనం చేసుకుని హింసకు పాల్పడుతున్నారని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. కచ్చితంగా ఈ హింసాకాండలో విదేశీ సంస్థల జోక్యం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 


"కుకీ మిలిటెంట్స్‌ క్యాంప్‌లలోనే మకాం వేస్తున్నారని, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇదే విషయాన్ని అమిత్‌షాతో చెప్పాను. కావాలనే ఇలాంటివి చెప్పి మభ్యపెడుతున్నారు. రాష్ట్రాన్ని తగలబెడుతున్న ఈ మంటలు ఎక్కడ పుట్టాయో అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి ఇదంతా చేస్తున్నారో తెలియట్లేదు"


-  ఎమ్‌ రామేశ్వర్ సింగ్, NPP నేత


అక్రమ వలసలు..


గత నెల మణిపూర్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మయన్మార్ నుంచి మణిపూర్‌కి అక్రమంగా వలస వచ్చిన వాళ్ల బయోమెట్రిక్ డేటాను సేకరించింది. జులైలోనే దాదాపు 700 మంది అక్రమంగా రాష్ట్రంలోకి వచ్చినట్టు నిర్ధరించింది. హోంశాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం...718 మంది అక్రమ వలసదారులున్నారు. వీరిలో 301 మంది పిల్లలే. జులై 22,23 తేదీల్లో వీళ్లు రాష్ట్రంలోకి అక్రమంగా వచ్చినట్టు తేలింది. మణిపూర్‌కి ఆర్మీని పంపితే రెండ్రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమత బిశ్వ శర్మ స్పందించారు. అక్కడ పరిస్థితులు చక్కదిద్దడం సైన్యం వల్ల కాదని తేల్చి చెప్పారు. బులెట్‌లతో కాకుండా శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు. ఆర్మీ వెళ్తే ఆ రాష్ట్రంలో హింస తగ్గిపోతుందని రాహుల్ చేసిన కామెంట్స్‌ని ఖండించారు. "అక్కడి ప్రజలను కాల్చిపారేయని చెబుతున్నారా" అంటూ మండి పడ్డారు. 


Also Read: నాకు ముస్లిం ఓట్లు అవసరం లేదు, ఓటు వేయమని వాళ్లను అడగను - అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ