Himanta Biswa Sarma:
ముస్లిం ఓట్లు అక్కర్లేదు..
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు ముస్లిం ఓట్లు అవసరం లేదని తేల్చి చెప్పారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు తాను దూరం అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లా ప్రతి అంశాన్ని రాజకీయం చేసి ఓట్ల కోసం హడావుడి చేయమని వెల్లడించారు. ముఖ్యంగా ముస్లింల సమస్యలపై ఓటు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుతానికి తనకు ముస్లింల ఓట్లు అవసరం లేదని తెలిపారు.
"ప్రస్తుతానికి నాకు ముస్లిం ఓట్లతో పని లేదు. వాటి అవసరం నాకు లేదు. ఓటు బ్యాంకు రాజకీయాల వల్లే సమస్యలన్నీ. నెలకోసారి ముస్లింలున్న ప్రాంతానికి వెళ్తాను. వాళ్ల కార్యక్రమాలకు హాజరవుతాను. వాళ్లతో మాట్లాడతాను. కానీ వాళ్ల అభివృద్ధిని రాజకీయాలతో ముడిపెట్టను. కాంగ్రెస్ ఇన్నాళ్లు తమను ఓట్ల కోసం ఎలా వాడుకుందో ముస్లింలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాు"
- హిమంత బిశ్వ శర్మ, అసోం సీఎం
తనకు ఓట్లు అవసరం లేదని, ఓ పదేళ్ల సమయం ఇవ్వాలని కోరారు హిమంత. పదేళ్లలో ఎంత అభివృద్ధి చేశానో చూసి అప్పుడు ఓటు వేయాలని ముస్లింలను ఉద్దేశిస్తూ చెప్పారు. ముస్లిం యువతుల కోసం ప్రత్యేకంగా కాలేజీలు ఏర్పాటు చేయనున్నామని, వాళ్లు బాగా చదువుకోవాలని సూచించారు.
"మాకు ఓట్లు వేయకండి. వచ్చే పదేళ్లలో మీ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు అవకాశమివ్వండి. బాల్య వివాహాలను అడ్డుకుంటాను. మదర్సాలకు వెళ్లడం ఆపేయండి. వాటి బదులుగా కాలేజీలకు వెళ్లండి. ముస్లిం యువతుల కోసమే ప్రత్యేకంగా 7 కాలేజీలు ప్రారంభించబోతున్నాను. వెళ్లి చదువుకోండి"
- హిమంత బిశ్వ శర్మ, అసోం సీఎం
15వ ముఖ్యమంత్రిగా..
అసోంకి 15వ ముఖ్యమంత్రిగా ఎన్నికైన హిమంత బిశ్వ శర్మ...బీజేపీని ముస్లింలు ఎలా అర్థం చేసుకోవాలో వివరించారు. ఓటు రాజకీయాలను దాటుకుని వచ్చి బీజేపీ గురించి తెలుసుకోవాలని సూచించారు. ముస్లిం ప్రాంతాల్లో ఇన్నాళ్లు కాంగ్రెస్ ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదని విమర్శించారు. కాంగ్రెస్ చేయలేని పని తాను చేసి చూపిస్తానని భరోసా ఇచ్చారు. ఇప్పుడే వాళ్ల నుంచి ఓట్లు అడిగి, ఆ తరవాత అభివృద్ధి చేస్తే అది ఇచ్చిపుచ్చుకోవడం అవుతుందని అన్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ముస్లిం ప్రాంతాలకు వెళ్లి తాను ప్రచారం చేయలేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచిన తరవాతే అక్కడికి వెళ్లినట్టు గుర్తు చేశారు. ఈసారి కూడా ముస్లింలు వాళ్లకు నచ్చిన వాళ్లకే ఓటు వేయాలని చెప్పారు. 2021లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించింది బీజేపీ. 126 సీట్లున్న అసోంలో 60 స్థానాలు గెలుచుకుంది. AGP,UPPL పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2015 వరకూ కాంగ్రెస్‌లో ఉన్న హిమంత బిశ్వ శర్మ ఆ తరవాత బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆయనకు పార్టీలో ప్రాధాన్యత దక్కుతోంది. ట్రబుల్ షూటర్‌గానూ పేరు తెచ్చుకున్నారు.
Also Read: మణిపూర్ సమస్యను ఆర్మీ పరిష్కరించలేదు, కాల్చిపారేయాలని సలహా ఇస్తున్నారా - రాహుల్‌పై హిమంత ఫైర్