Manipur Violence: 



ఆర్మీ వల్ల కాదు..


మణిపూర్‌కి ఆర్మీని పంపితే రెండ్రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమత బిశ్వ శర్మ స్పందించారు. అక్కడ పరిస్థితులు చక్కదిద్దడం సైన్యం వల్ల కాదని తేల్చి చెప్పారు. బులెట్‌లతో కాకుండా శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు. ఆర్మీ వెళ్తే ఆ రాష్ట్రంలో హింస తగ్గిపోతుందని రాహుల్ చేసిన కామెంట్స్‌ని ఖండించారు. "అక్కడి ప్రజలను కాల్చిపారేయని చెబుతున్నారా" అంటూ మండి పడ్డారు. మణిపూర్‌ విషయంలో మొదటి నుంచి ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు హిమత బిశ్వ శర్మ. ఆయనను ట్రబుల్ షూటర్‌గానూ పరిగణిస్తోంది హైకమాండ్. లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ అవిశ్వాస తీర్మానంపై ప్రస్తావించిన అంశాలను మరోసారి గుర్తు చేశారు శర్మ. మిజోరంపై ఎయిర్ స్ట్రైక్ చేసింది కాంగ్రెస్‌ కాదా అని ప్రశ్నించారు. 


"మిజోరంలోని ఐజ్వాల్‌పై ఇందిరా గాంధీ ఎయిర్‌స్ట్రైక్ చేయించారు. బాంబుల మోత మోగించారు. ఇప్పుడిప్పుడే అక్కడ హింస తగ్గుతోంది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ వచ్చి అక్కడ ఆర్మీ జోక్యం చేసుకోవాలని సలహాలిస్తున్నారు. దీనర్థం ఏంటి..? ప్రజలపై కాల్పులు జరపాలని చెబుతున్నారా..? అలా ఎలా మాట్లాడతారు. ఆర్మీ ఆ సమస్యను పరిష్కరించలేదు. తాత్కాలికంగా హింసను తగ్గించగలరేమో కానీ శాశ్వతంగా శాంతియుత వాతావరణ నెలకొనేలా చేయలేరు. ఈ సమస్యను మనసుతో ఆలోచించి పరిష్కరించాలి. బులెట్‌లతో ఏమీ జరగదు"


- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి 






విపక్షాలపై విమర్శలు..


ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్‌పై మాట్లాడాలని డిమాండ్ చేసిన విపక్ష ఎంపీలు...ప్రధాని ప్రసంగిస్తుండగానే వాకౌట్ చేశారని మండి పడ్డారు హిమంత. దీంతోనే వాళ్ల వైఖరేంటో స్పష్టంగా ప్రజలకు అర్థమైందని విమర్శించారు. 


"విపక్షాల ఉద్దేశం మణిపూర్‌ సమస్యను పరిష్కరించడం కాదు. కేవలం పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడం. సభలో గట్టిగా అరిచి డిస్టర్బ్ చేయాలని డిసైడ్ అయి వచ్చారు. అది మణిపూర్‌పై ప్రేమ కానే కాదు. కేవలం ఓటు రాజకీయాల కోసం చేసిన ఆందోళన. ఆ రాష్ట్రం గురించి ప్రధాని మాట్లాడింది పది నిముషాలే కావచ్చు. కానీ అవి ఆయన మనసులో నుంచి వచ్చిన మాటలు. ఈశాన్య రాష్ట్ర ప్రజలపై ఆయనకున్న ప్రేమెంతో అందరికీ అర్థమైంది. ఆయన అలా మాట్లాడడం మాకు చాలా ఆనందాన్నిచ్చింది. విపక్షాలే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయి"


- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి 


మోదీ స్పీచ్‌ని ఇప్పటికే విపక్షాలు ఖండించగా...ఇప్పుడు రాహుల్ స్పందించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ప్రధానిపై విమర్శలు చేశారు. మణిపూర్‌ మంటల్లో తగలబడిపోతున్నా...మోదీ వాటిని చల్లార్చే ప్రయత్నం చేయడం లేదని అన్నారు. మణిపూర్‌లో భరత మాతను హత్య చేశారన్న వ్యాఖ్యలపై దుమారం రేగినప్పటికీ...అవే వ్యాఖ్యల్ని మరోసారి చేశారు రాహుల్. ఎంతో ఆవేదనతో ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని వివరించారు. రెండు గంటల పాటు ప్రసంగించిన ప్రధాని...జోక్‌లు వేయడం, నవ్వడం తప్ప మరేమీ చేయలేదని విమర్శించారు. మణిపూర్‌లో హింసను ఎలా అదుపులోకి తీసుకురావాలన్నదే అసలైన చర్చ అని...అది తప్ప అన్నీ మాట్లాడారని అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో భరత మాత గురించి మాట్లాడడం కూడా తప్పైపోయిందని అన్నారు. ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగితే రెండ్రోజుల్లోనే పరిస్థితులు అదుపులోకి వస్తాయని, కానీ ప్రధాని మోదీకి అక్కడి మంటలు ఆర్పడం ఇష్టం లేదని విమర్శించారు. 


Also Read: దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తాం, లోక్‌సభలో అమిత్‌షా కీలక ప్రకటన