Manipur Violence:
20 మంది ఎంపీల పర్యటన..
మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్‌లో తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసిన INDIA కూటమి ఎంపీలు ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇవాళ, రేపు ( జులై 29,30) అక్కడే పర్యటిస్తారు. ఉదయం బయల్దేరి మధ్యాహ్నానికి అక్కడ చేరుకోనున్నారు. ఈ కూటమిలోని 16 పార్టీలకు చెందిన 21 మంది ఎంపీలు వెళ్తున్నారు. అక్కడి పరిస్థితులు సమీక్షిస్తారు. కాంగ్రెస్ తరపున అధిర్ రంజన్ చౌదరి, గౌరవ్ గొగోయ్ వెళ్తున్నారు. ఆప్ నుంచి సుశీల్ గుప్తా, డీఎమ్‌కే నుంచి కనిమొళి కరుణానిధి వెళ్లనున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. ఈ పర్యటనను రాజకీయం చేయడం తమ ఉద్దేశం కాదని, కేవలం మణిపూర్ పౌరుల ఆవేదనను అర్థం చేసుకోడానికే వెళ్తున్నామని ఇప్పటికే INDIA స్పష్టం చేసింది.
"మణిపూర్‌లో తలెత్తిన సమస్యకు పరిష్కారం చూపించాలని కేంద్రాన్ని మేం డిమాండ్ చేస్తూనే ఉన్నాం. అక్కడ పరిస్థితిని శాంతిభద్రతల సమస్యగానే చూడలేం. అది రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణ. దీని వల్ల పొరుగు రాష్ట్రాల్లోనూ ఆందోళన మొదలైంది. కానీ ప్రభుత్వం ఈ విషయంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదు. అందుకే...అక్కడి వాస్తవాలేమిటో తెలుసుకోడానికి మేం వెళ్తున్నాం"
- అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్ ఎంపీ
ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన..
కాంగ్రెస్ ఎంపీ నజీర్ హుస్సేన్ చెప్పిన వివరాల ప్రకారం ఈ 20 మంది ఎంపీలు మణిపూర్‌లోని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఆ తరవాత రాష్ట్ర గవర్నర్ అనుసూయ ఉయ్‌కేని కలవనున్నారు. ఈ పర్యటన ముగిసిన తరవాత మణిపూర్‌లో తాము ఏం గమనించారో పార్లమెంట్‌లో చర్చించాలని భావిస్తున్నారు. ఒకవేళ కేంద్రం అందుకు అడ్డుపడితే ప్రత్యేకంగా ప్రెస్‌కాన్ఫరెన్స్ పెట్టి ప్రజలందరికీ వివరించాలని నిర్ణయించుకున్నారు. పార్లమెంట్‌లో ఈ అంశంపై చర్చించేందుకు బీజేపీ ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదని మండి పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో పర్యటించేందుకు ప్రధానికి సమయం ఉంది కానీ...మణిపూర్‌కి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. మే 3వ తేదీ నుంచి అక్కడ అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ 160 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also Read: CM Siddaramaiah: కారు పార్కింగ్ కోసం సీఎంనే ఆపేసిన వృద్ధుడు