Prayagraj Fire Accident: ప్రయాగ్‌రాజ్: మహా కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాగ్ రాజ్ లోని సెక్టార్ 8లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా సెక్టార్ 8లో మంటలు చెలరేగగా, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


సెక్టార్ 18, సెక్టార్ 19 మధ్య అగ్నిప్రమాదం జరిగిన రెండు రోజులకే మరోసారి కుంభమేళాలో ఈ ఘటన జరిగింది. ఆ అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు, అధికారులు తెలిపారు. తాజాగా సెక్టార్ 8లో అగ్నిప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక బృందం అక్కడికి చేరుకున్నాయి. భక్తుల కోసం ఏర్పాటు చేసిన గుడారాలలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చాయి. పెద్దగా ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాలని భక్తులకు అధికారులు సూచించారు.


కుంభమేళాలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాలు
ఈ మహా కుంభమేళాలో ఇదే మొదటి అగ్ని ప్రమాదం కాదు. కుంభమేళా 7వ రోజున మొదటి అగ్నిప్రమాదం జరిగింది. సెక్టార్ 19లో మంటలు చెలరేగి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన గుడారాలు దగ్ధమయ్యాయి. సిలిండర్ పేలడంతో ప్రమాదం సంభవించింది. ఫిబ్రవరి 9న సెక్టార్ 9లో ఓ గుడారంలో సిలిండర్ లీక్ కారణంగా మరో అగ్ని ప్రమాదం జరిగింది. ఫిబ్రవరి 13న, రెండు వేర్వేరు చోట్ల మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు.


వేగంగా స్పందిస్తున్న ఫైర్ సిబ్బంది


సెక్టార్ 19లో శనివారం మంటలు చెలరేగాయి. ఏడు గుడారాలు మంటల్లో కాలిపోయాయి. అందులో ఉంచిన ఆహార ధాన్యాలు, సరుకులు, దుప్పట్లు వంటివి కాలిపోయాయని అధికారులు తెలిపారు. ప్రయాగ్‌రాజ్ లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్న ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ADG భాను భాస్కర్ తెలిపారు. సాయంత్రం 6:15 గంటలకు లవ్ కుష్ సేవా మండల్ శిబిరం సమీపంలో మంటలు చెలరేగాయని డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. అగ్నిమాపక దళం వేగంగా స్పందించి కేవలం 5 నిమిషాల్లో మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది.


Also Read: Prayagraj Road Accident: మహా కుంభమేళా యాత్రలో విషాదం, బస్సును ఢీకొన్న బొలెరో - 10 మంది భక్తులు మృతి