Devotees from Chhattisgarh to Maha Kumbh | ప్రయాగ్‌రాజ్: మహా కుంభమేళా యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్ నుండి మహా కుంభమేళాకు భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది భక్తులు మృతిచెందగా, మరో 19 మందికి గాయాలయ్యాయి.  ప్రయాగ్‌రాజ్- మిర్జాపూర్ హైవేపై శుక్రవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం స్వరూప్ రాణి మెడికల్ హాస్పిటల్‌కు తరలించామని యమునానగర్ డీసీపీ వివేక్ చంద్ర యాదవ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతులు ఛత్తీగ్ గఢ్‌కు చెందిన వారిగా గుర్తించారు. 






యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి
మహా కుంభమేళాకు వస్తున్న భక్తుల వాహనం రోడ్డు ప్రమాదానికి గురై 10 మంది చనిపోవడంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాగ్‌రాజ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. సహాయక చర్యలు చేపట్టి, వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.  గాయపడినవారు త్వరగా కోలుకోవాలని యోగి ఆకాంక్షించారు.