ICC Champions Trophy Updates: సొంతగడ్డపై వచ్చేవారం నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్థాన్ కు ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం లాహోర్లోని గడాఫీ స్టేడియం వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే టోర్నీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఐదు వికెట్లతో ఓడిపోయింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. చాలా సాధారణమైన ప్రదర్శన చేసింది. బ్యాటింగ్ కు అనుకూలించిన పిచ్ పై పూర్తి కోటా కూడా ఆడకుండా 49.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది.
మహ్మద్ రిజ్వాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ (46) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. విలియం ఓ రౌర్క్ (4-43) పాక్ బ్యాటింగ్ నడ్డి విరిచాడు. ఛేదనను న్యూజిలాండ్ 45.2 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసి ఆడుతూ పాడుతూ పూర్తి చేసింది. డారిల్ మిషెల్ అర్జ సెంచరీ (57)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. నసీమ్ షాకు రెండు వికెట్లు దక్కాయి. ఓ రౌర్క్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ లో 219 పరుగులు ఒక వికెట్ తీసిన సల్మాన్ ఆఘాకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. మెగాటోర్నీ ఆరంభ మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్యే జరుగుతుండగా, కివీస్ ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగనుంది.
అస్థిరమైన ఆటతీరు..
టోర్నీ గత మ్యాచ్ లో 353 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసిన పాక్.. ఈ మ్యాచ్ లో 242 పరుగులకే ఆలౌటైంది. కివీస్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో పాక్ ఏ దశలోనూ భారీ స్కోరు దిశగా సాగలేదు. రిజ్వాన్ తో పాటు, సల్మాన్ ఆఘా (45), తయ్యబ్ తాహిర్ (38) రాణించారు. బాబర్ ఆజమ్ (29) మరోసారి నిరాశ పరిచాడు. బౌలర్లలో మైకేల్ బ్రాస్ వెల్, కెప్టెన్ మిషెల్ శాంట్నర్ కు రెండు, నాథన్ స్మిత్, జాకబ్ డఫీకి తలా ఒక వికెట్ లభించింది.
సమష్టి పోరాటం..
ఓ మాదిరి టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్ ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ విల్ యంగ్ (5) త్వరగానే పెవిలియన్ కు చేరాడు. ఇక్కడి నుంచి కివీస్ బ్యాటర్లు ఓపికగా బ్యాటింగ్ చేస్తూ ఒక్కో పరుగు జత చేస్తూ ముందుకు కదిలారు. మరో ఓపెనర్ డేవన్ కాన్వే (48), వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లేథమ్ (56) అర్థ సెంచరీతో సత్తా చాటాడు. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (34) సమయోచితంగా ఆడటంతో వికెట్లు వరుస విరామాల్లో పడినా, కివీస్ ఇబ్బంది పడలేదు. బాధ్యతగా బ్యాటర్లంతా వ్యవహరించడంతో మరో 28 బంతులు మిగిలి ఉండగానే కివీస్ విజయం సాధించింది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన న్యూజిలాండ్.. ఏకంగా కప్పునే గెలుచుకుని మెగాటోర్నీకి ముందు తన సన్నాహకాలను పటిష్టం చేసుకుంది. మిగతా బౌలర్లలో షాహిన్ షా ఆఫ్రిది, అబ్రార్ అహ్మద్,సల్మాన్ ఆఘాకు తలో వికెట్ లభించింది.