RCB Vs GG Result Update: డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ (27 బంతుల్లో 64 నాటౌట్, 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించడంతో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ ను ఆర్సీబీ ఓడించింది. బరోడాలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ యాష్లీ గార్డెనర్ (79 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్ తో సత్తా చాటింది. అనంతరం ఛేదనను 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు 202 పరుగులతో పూర్తి చేసి, గెలుపొందింది. ఆల్ రౌండర్ ఎలీస్ పెర్రీ మెరుపు అర్థ సెంచరీ (34 బంతుల్లో 57, 6 ఫోర్లు, 2 సిక్సర్లు)తో సత్తా చాటింది. బౌలర్లలో యాష్లీ గార్డెనర్ కు రెండు వికెట్లు దక్కాయి. ఈ ఛేదన టోర్నీ చరిత్రలో అతి పెద్దది కావడం విశేషం.
మంధానా విఫలమైనా..202 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సబీకి ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. కెప్టెన్ కమ్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన (9), డానీ వ్యాట్ (4) త్వరగానే ఔట్ కావడంతో 14 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఈదశలో ఎలీస్ పెర్రీ, రాఘవి బిస్త్ (25) తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. ప్రత్యర్థులపై ఎదురుదాడిక ఒక వైపు పెర్రీ దిగుతుంటే, యాంకర్ రోల్ పోషిస్తూ స్ట్రైక్ ను రాఘవి చేసింది. దీంతో మూడో వికెట్ కు కీలకమైన 86 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. కేవలం 27 బంతుల్లోనే ఫిఫ్టీని పెర్రీ పూర్తి చేసుకుంది. అయితే ఎనిమిది బంతుల తేడాతో వీరిద్దరూ వెనుదిరగడంతో ఆర్సీబీకి ఓటమి తప్పదనిపించింది.
మెరుపు బ్యాటింగ్..నాలుగు వికెట్లు పడినా, ఏమాత్రం అధైర్య పడకుండా కనిక అహుజా (13 బంతుల్లో 30 నాటౌట్, 4 ఫోర్లు)తో కలిసి రిచా ఫియర్లెస్ క్రికెట్ ఆడింది. బౌండరీలు, సిక్సర్లతో విరుచుకు పడి ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసింది. దీంతో స్కోరు బోర్డు వాయు వేగంతో పరుగులెత్తింది. ఇదే జోష్ లో కేవలం 23 బంతుల్లోనే ఫిఫ్టీ చేసుకుని జట్టను విజయ తీరాలకు చేర్చింది. కనిక కూడా నాలుగు బౌండరీలు బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. మిగతా బౌలర్లలో సయాలి సత్ఘారే, డియోంద్ర డాటిన్ కు తలో వికెట్ దక్కింది. రిచా ఘోష్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. టోర్నీలో తర్వాతి మ్యాచ్ ఇదే వేదికపై శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతుంది.
Read Also: WPL 2025 Update: ప్రారంభమైన డబ్ల్యూపీఎల్.. గుజరాత్ భారీ స్కోరు.. ఆర్సీబీతో తొలి మ్యాచ్