ఓ ఇంటిని ఓ వ్యక్తి అద్దెకు తీసుకున్నాడు. ఏడాది తర్వాత ఖాళీ చేసేశాడు. అందులో తన వస్తువులు ఉన్నాయని తర్వాత తీసుకుంటానంటూ ఓనర్‌కి చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి వస్తువులు ఉన్న రూమ్స్ తప్ప మిగతావి రెంట్‌కు ఇద్దామని అనుకున్నాడు. టూలెట్ బోర్డు పెట్టగానే ఇంకో వ్యక్తి వచ్చాడు. రూమ్ చూపించమన్నాడు. ఓనర్ వచ్చి రూమ్‌లన్నీ చూపించాడు. వాళ్లకు నచ్చలేదు. రూమ్ తాళం వేసిన ఓనర్‌ పవర్ ఆఫ్‌ చేసి వెళ్లిపోయాడు. 


నాలుగు రోజుల తర్వాత చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఓనర్‌కు కబురు పెట్టాడు. అతను రాగానే పోలీసులు ఇంటి తాళం తీయమని చెప్పారు. తీసిన తర్వాత అక్కడ దృశ్యాలు చూసిన స్థానికులతోపాటు పోలీసులు, ఓనర్ అంతా షాక్‌ తిన్నారు. టూ లెట్ బోర్డు పెట్టడంతో ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 


మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో జరిగిన ఘటన సంచలనంగా మారింది. 2023జూన్‌లో ఆ ఇంటిని సంజయ్‌ పాటేదార్ అనే ఉజ్జయిని వ్యక్తి అద్దెకు తీసుకున్నాడు. ఉద్యోగం చేస్తూ చదువుకుంటున్నట్టు చెప్పాడు. అతనితోపాటు ఓ యువతిని కూడా తీసుకొచ్చాడు. ఇద్దరూ ఆ ఇంట్లో కలిసే ఉన్నారు. ఏడాది బాగానే ఉంది. ఆ తర్వాత యువతి కనిపించకుండా పోయింది. 
కొన్ని నెలల తర్వాత సంజీవ్ పాటేదార్‌ కూడా ఇంటిని ఖాళీ చేస్తున్నట్టు ఓనర్‌కు చెప్పాడు. అయితే తన వస్తువులు కొన్ని ఇంట్లో ఉన్నాయని వాటిని తర్వాత తీసుకెళ్తానంటూ చెప్పుకొచ్చాడు. అందుకు ఓనర్ కూడా ఓకే చెప్పాడు. చాలా కాలంగా ఆ ఇల్లు ఖాళీగానే ఉంది. ఈ మధ్యే రెంట్‌కు వచ్చేందుకు ఓ వ్యక్తి వచ్చి ఇంటిని చూపించమన్నాడు. చూపించిన ఓనర్‌ తర్వాత పవర్ ఆఫ్ చేసి వెళ్లిపోయాడు. 


మూడు నాలుగు రోజుల తర్వాత ఆ ఇంటి నుంచి భరించలేని దుర్వాసన వచ్చింది. చుట్టపక్కల వాళ్లు ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వాసన టూలెట్ పెట్టిన ఇంటి నుంచే వస్తుందని గ్రహించారు. అంతే ఆ ఇంటి వానర్‌ పిలిచి మాట్లాడారు. ఇంటి తాళం తీయించి చూసి అంతా షాక్ అయ్యారు. 


ఈ ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌లో ఓ మహిళ డెడ్‌బాడీ ఉంది. ఆమెను చాలా నెలల క్రితమే చంపేసినట్టు గుర్తించారు. మెడకు తాడుతో కట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆ గుర్తులు కనిపించకుండా మెడలో బంగారం చైన్‌ వేసి ఉంది. చేతులు వెనక్కి విరిచి కట్టేసి ఉంది. ఆ సీన్ చూసిన పోలీసులకు ఓ క్లారిటీ వచ్చింది. 


ఆ ఇంటిని రెంటుకు తీసుకున్న సంజీవ్‌ పాటేదార్‌... ఆ మహిళతో సహజీవనం చేశాడు. కొన్నేళ్లు బాగానే సాగింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. పెళ్లి చేసుకోమని ప్రియురాలి ఒత్తిడి తీసుకొచ్చింది. ఆమెను చంపేసి సైలెంట్‌గా అక్కడి నుంచి చెక్కేశాడు. డెడ్‌ బాడీని ఫ్రిజ్‌లో పెట్టాడు. అయితే ఇన్ని రోజులు ఆ ఇంటికి పవర్ సప్లై ఉన్నందున ఫ్రిజ్ పని చేస్తూ స్మెల్‌ రాకుండా ఉంది. ఎప్పుడైతే ఓనర్ వచ్చి పవర్ సప్లై ఆపేశాడో స్మెల్ రావడంతో అసలు వెలుగులోకి వచ్చింది. ఈ హత్య చేసిన సంజీవ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఒక వేళ టూలెట్‌ బోర్డు పెట్టకపోయినా, ఆ ఇంటిని చూసేందుకు ఎవరూ రాకపోయినా ఈ డెడ్‌ బాడీ విషయం వెలుగులోకి వచ్చేది కాదని పోలీసులు అంటున్నారు.