Construction Roof Collapsed In Kannauj Railway Station: యూపీలో శనివారం ప్రమాదం జరిగింది. కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో కూలీలు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 23 మందిని రక్షించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వారిని మెరుగైన చికిత్స నిమిత్తం లక్నోకు తరలించారు. కాగా, కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో (Kannauj Railway Station) ఆధునికీకరణ పనుల్లో భాగంగా పలు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం రెండో అంతస్తులో ఉన్న పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భారీ శబ్దం రావడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
సీఎం దిగ్భ్రాంతి
అటు, ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.