Madhya Pradesh High Court: స్కాచ్ విస్కీ వినియోగదారుల (Scotch Whiskey Consumers)పై మధ్యప్రదేశ్ హైకోర్టు (Madhya Pradesh High Court) గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. స్కాచ్ విస్కీ మద్యం తాగే వారు విద్యావంతులని, సమాజంలోని సంపన్న వర్గానికి చెందినవారని మధ్యప్రదేశ్ హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. వారు రెండు వేర్వేరు బ్రాండ్‌ల బాటిళ్లను సులభంగా గుర్తించగలరని కోర్టు పేర్కొంది.  ఇండోర్‌కు చెందిన జేకే ఎంటర్‌ప్రైజెస్ (JK Enterprises) కంపెనీని 'లండన్ ప్రైడ్' మార్క్ కింద మద్యం తయారు చేయకుండా నిరోధించాలని లిక్కర్ కంపెనీ పెర్నోడ్ రికర్డ్ (Pernod Ricard) చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.


జేకే  ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ 'బ్లెండర్స్ ప్రైడ్' (Blenders Pride)  ట్రేడ్‌మార్క్, 'ఇంపీరియల్ బ్లూ' (Imperial Blue) బాటిల్ నమూనాలను  ఉల్లంఘించిందని, తాత్కాలిక నిషేధం విధించాలని రికర్డ్ సంస్థ మధ్యప్రదేశ్ హైకోర్టును అభ్యర్థించింది. JK ఎంటర్‌ప్రైజెస్ తన కస్టమర్లను మోసం చేయడానికి 'లండన్ ప్రైడ్' గుర్తును ఉపయోగిస్తోందని ఆరోపించింది. 


దీనిపై జస్టిస్ సుశ్రుత్ అరవింద్ (Justice Sushrut Arvind), జస్టిస్ ప్రణయ్ వర్మ (Justice Pranay Verma)లతో కూడిన డివిజన్ బెంచ్ స్పందిస్తూ.. ఈ రెండు బ్రాండ్‌ల ఉత్పత్తుల్లో ప్రీమియం లేదా అల్ట్రా ప్రీమియం విస్కీ ఉంటాయని, దీని వినియోగదారులు విద్యావంతులు, వివేకం ఉన్నవారని, బాటిళ్ల మధ్య వత్యాసాన్ని సులువుగా గుర్తిస్తారని అన్నారు. బ్లెండర్స్ ప్రైడ్/ఇంపీరియల్ బ్లూ,  లండన్ ప్రైడ్ బాటిళ్ల మధ్య తేడాను గుర్తించగలిగే తెలివితేటలను అవి తాగే వారు కలిగి ఉంటారని బెంచ్ పేర్కొంది.


ఇదే బ్రాండ్‌పై తాత్కాలిక నిషేధం కోరుతూ రికర్డ్ సంస్థ ఇండోర్ లోని న్యాయస్థానాన్ని ఆశ్రించగా దానిని కోర్టు కొట్టివేసింది. దీంతో రికర్డ్ హైకోర్టును ఆశ్రయించింది. తాము 1995 నుంచి 'బ్లెండర్స్ ప్రైడ్' గుర్తును ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది.  తమ ఉత్పత్రి అయిన 'ఇంపీరియల్ బ్లూ' విస్కీని పోలి ఉండే ప్యాకేజింగ్, రూపురేఖలు, వాణిజ్య మార్కులను ఉపయోగించి JK ఎంటర్‌ప్రైజెస్ తన విస్కీ విక్రయిస్తోందని కూడా పేర్కొంది. 


దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ ఇంపీరియల్ బ్లూ, లండన్ ప్రైడ్ బాటిళ్లను పోల్చి చూస్తే జేకే ఎంటర్‌ప్రైజెస్ గుర్తు మోసపూరితంగా పోలి ఉంటుందని చెప్పలేమని కోర్టు పేర్కొంది. బాటిళ్ల ఆకారం కూడా భిన్నంగా ఉందని, వాటి బాక్సులు సైతం భిన్నంగా ఉన్నాయని కోర్టు తెలిపింది. కస్టమర్ ఆయా బ్రాండ్ల మధ్య తేడాలను సులభంగా కోర్టు పేర్కొంది. అలాగే పెర్నోడ్ రికర్డ్ దాని ఇంపీరియల్ బ్లూ మార్క్‌, గోపురం ఆకారంతో సహా డిజైన్‌లోని ఏదైనా భాగంలో ఉపయోగించిన రంగులకు సంబంధించి ఎటువంటి రిజిస్ట్రేషన్‌ను కలిగి లేదని కోర్టు పేర్కొంది.


ప్రతివాది 'ప్రైడ్' అనే పదాన్ని ఉపయోగించడం వల్ల వినియోగదారుడి మనస్సులో ఎలాంటి అపోహ ఉండదని కోర్టు పేర్కొంది. రెండు గుర్తులు, నమూనాల మధ్య సారూప్యత లేదని ట్రయల్ కోర్టు చేసిన పరిశీలనలో ఎలాంటి పొరపాటు లేదని హైకోర్టు గుర్తించింది. పెర్నోడ్ రికర్డ్ దాఖలు చేసిన దావాను తొమ్మిది నెలల్లోగా పరిష్కరించాలని ఆదేశించింది.