Hanuman Adivasi:



ఉమంగ్ సింగార్ కామెంట్స్..


మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమంగ్ సింగార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధార్ జిల్లాలో బిస్రా ముండా (Bisra Munda) 123వ వర్ధంతికి హాజరైన ఆయన హనుమంతుడు ఆదివాసీ అని తేల్చి చెప్పారు. రామాయణంలోని వానర సేన అంతా ఆదీవాసీ తెగకు చెందిన వాళ్లేనని అన్నారు. లంకకు రాముడిని తీసుకెళ్లింది ఆదివాసీలేనంటూ కామెంట్ చేశారు. 


"శ్రీరాముడిని లంకకు తీసుకెళ్లింది ఆదివాసీలే. కొంత మంది వానర సేన రాముడికి సాయం చేసిందని చరిత్రలో రాశారు. అది నిజం కాదు. రాముడిని లంకకు చేర్చింది ఆదివాసీలే. వాళ్లు అడవుల్లో జీవించే వాళ్లు. హనుంతుడు కూడా ఆదివాసీ తెగకు చెందిన వాడే. మనమంతా ఆయన వారసులం. ఇందుకు మనం ఎంతో గర్వపడాలి"


- ఉమంగ్ సింగార్, కాంగ్రెస్ ఎమ్మెల్యే 


దీనిపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. హిందువుల ఆరాధ్య దైవమైన హనుమంతుడిని కించపరించారంటూ మండి పడ్డారు. మధ్యప్రదేశ్ బీజేపీ ప్రతినిధి హితేష్ బాజ్‌పాయ్‌ ట్వీట్ చేశారు. 


"హనుమంతుడు దేవుడు అని ఒప్పుకోడానికి కూడా వాళ్లకు మనసు రావడం లేదు. హిందువులు ఆయనను ఎంతగా ఆరాధిస్తారో అన్న అవగాహన కూడా లేదు. ఈ వ్యాఖ్యలతో ఆయనను దారుణంగా అవమానించారు"


- హితేష్ బాజ్‌పాయ్, బీజేపీ నేత


హితేష్ అంతటితో ఆగకుండా ఉమంగ్ సింగార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నేత..ఇలా మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారంటూ విమర్శించారు. 


"ఈ మాజీ మంత్రి ఎన్నో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. హనుమంతుడికి కాంగ్రెస్ ఇచ్చే గౌరవం ఇదేనా..? వేరే మతం పుచ్చుకుని కాంగ్రెస్ ఇలా మాట్లాడిస్తోందా..?"


- హితేష్ బాజ్‌పాయ్, బీజేపీ నేత


ఈ ట్వీట్‌లలో ప్రియాంక గాంధీతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌నీ ట్యాగ్ చేశారు హితేష్. ఇప్పుడే కాదు. హనుమంతుడు ఆదివాసీ అంటూ గతంలోనూ ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ బహిరంగ సభలో కామెంట్ చేశారు. అర్జున్ సింగ్ కకోడియా ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ...హనుమంతుడు ఆదివాసీయే అని తేల్చి చెప్పారు. ఆ కార్యక్రమంలో సీఎం కమల్‌నాథ్ కూడా ఉన్నారు. అప్పట్లోనూ ఇది వివాదాస్పదమైంది. ఇప్పుడు మరోసారి అదే వివాదం తెరపైకి వచ్చింది. 


హనుమంతుడే మాకు స్ఫూర్తి - ప్రధాని మోదీ 


ఏప్రిల్ 6వ తేదీన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ఇదే సమయంలో హనుమాన్ జయంతి గురించీ ప్రస్తావించారు. హనుమంతుడిలాగానే భారత్...తన బలాన్ని తాను తెలుసుకుని ముందుకెళ్తోందని అన్నారు. 


"హనుమంతుడిలాగానే ఇవాళ భారత్ తన బలాన్ని తాను తెలుసుకుంది. అవినీతిపై పోరాటం చేయడంలో బీజేపీకి హనుమంతుడే స్ఫూర్తి. ఆయన స్ఫూర్తితోనే శాంతి భద్రతలను కాపాడగలుగుతున్నాం. హనుమాన్ జీవితాన్ని ఓ సారి పరిశీలించండి. ఎంత కష్టమొచ్చినా సరే నేను చేయగలను అని ఆయన గట్టిగా నమ్మారు. అదే ఆయనకు అన్ని విజయాలు తెచ్చి పెట్టింది. మా పార్టీ, పార్టీ కార్యకర్తలు నిత్యం ఆయన నుంచి స్పూర్తి పొందుతూనే ఉంటారు. ఆయన బోధనలను అనుసరిస్తారు. సముద్రమంత సవాళ్లెన్నో భారత్‌కు ఎదురవుతున్నా... మన దేశం అన్నింటినీ తట్టుకుని నిలబడగలిగింది. ఈ హనుమాన్ జయంతి రోజున మీ అందరికీ ఆయన ఆశీస్సులు అందాలని కోరుకుంటున్నాను"


- ప్రధాని నరేంద్ర మోదీ


Also Read: Biparjoy Cyclone: బలపడుతున్న బిపార్జాయ్ తుపాను, రానున్న 24 గంటలు అత్యంత కీలకం - IMD