Loksabha Election 2024:
కలిసున్నట్టేనా..?
2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సర్కార్‌ని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నాయి విపక్షాలు (Opposition Unity). రాహుల్ గాంధీపై అనర్హతా వేటు వేసిన సమయంలో కాంగ్రెస్‌తో సైద్ధాంతిక విభేదాలున్న పార్టీలు కూడా ఆ పార్టీకి మద్దతు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన స్వరం వినిపించాయి. అదానీ వ్యవహారం కూడా అన్ని పార్టీలనూ ఒక్కటి చేసింది. అప్పటి నుంచి వరుస భేటీలతో "మేమంతా ఒక్కటే" అనే సంకేతాలిస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో ఈ సమావేశాలు జరిగాయి. ఇటీవలే పట్నా వేదికగా బిహార్ సీఎం నితీష్ కుమార్ యాదవ్ నేతృత్వంలోనూ విపక్షాల భేటీ జరిగింది. ఈ నెలలోనూ కాంగ్రెస్ సారథ్యంలో మరోసారి మీటింగ్ జరగనుంది. అయితే...ఈ అన్ని భేటీల్లోనూ BRS కనిపించలేదు. కాంగ్రెస్ ఉన్న కూటమితో కలిసేదే లేదని BRS తేల్చి చెప్పింది. ఆ తరవాత రాహుల్ గాంధీ కూడా BRS ఉంటే తమ మద్దతు ఉండదని స్పష్టం చేశారు. బిహార్ సీఎం నితీశ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లాంటి సీనియర్ నేతలు ఈ సమావేశాల్లో కీలకంగా కనిపిస్తున్నారు. కానీ...కాంగ్రెస్‌కి దూరంగా ఉంటున్న BRS అధినేత కేసీఆర్‌తో అఖిలేష్ యాదవ్ భేటీ అవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇక శరద్ పవార్ కూడా గతంలో పలు అంశాల్లో కాంగ్రెస్ వైఖరిని ఖండించారు. ముఖ్యంగా అదానీ వ్యవహారం విషయంలో ఆ పార్టీకి పెద్దగా సపోర్ట్ ఇవ్వలేదు. మరి విపక్షాల కూటమిలో NCPకి ఏ మాత్రం ప్రాధాన్యత ఉంటుందన్నది తేలాల్సి ఉంది. తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం తన స్టాండ్ ఏంటో క్లియర్‌గానే చెప్పారు. కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉంటున్నారు.
విభేదాలు..
ఆప్, కాంగ్రెస్ మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. టీఎమ్‌సీ కూడా కాంగ్రెస్‌ని ఇటీవల టార్గెట్ చేసింది. పంచాయతీ ఎన్నికల విషయంలో ఈ రెండు పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. అంటే...ఈ కూటమిలోని పార్టీల్లో ఒకరితో ఒకరికి పొసగడం లేదు. అలాంటప్పుడు చివరి వరకూ ఇవి కలిసుండి మోదీ సర్కార్‌ని ఎలా ఢీకొడతాయన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల వ్యూహకర్తగా నితీష్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడాయన ఎన్నికల్లో ఎలాంటి స్ట్రాటెజీస్‌తో ముందుకెళ్లాలి అని ప్లాన్ చేయాలా..? లేదంటే పార్టీలను ఒక్కటి చేయడంపై శ్రద్ధ పెట్టాలా..? అన్నదీ మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదే అదనుగా కొన్ని సంస్థలు సర్వే కూడా మొదలు పెట్టాయి. అసలు విపక్షాలు మోదీ సర్కార్‌కి గట్టి పోటీని ఇవ్వగలవా అని ప్రశ్నించాయి. ఈ సర్వేలో పాల్గొన్న ఓటర్లలో దాదాపు 49% మంది "విపక్షాలకు అది సాధ్యం కాదు" అని తేల్చి చెప్పారు. 19% మంది మాత్రం గట్టి పోటీనే ఇస్తాయని వెల్లడించారు. పట్నా వేదికగా దాదాపు 15 పార్టీలు సమావేశమైనప్పటికీ...గత రెండు వారాల్లో వీటి మధ్య చీలికలు వచ్చాయి. ఉదాహరణకు NCPనే చూస్తే...ఇప్పుడు ఆ పార్టీ రెండుగా చీలిపోయింది. పట్నాలో విపక్షాల భేటీ జరిగిన రోజే...BRS మంత్రి కేటీఆర్ ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్‌షాతో భేటీ అవ్వడం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇక యూసీసీ విషయంలోనూ విపక్షాల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి.
Also Read: శరద్ పవార్ మరో ఉద్దవ్ థాక్రే అవుతారా? మైండ్‌గేమ్‌తో అజిత్‌కి షాకిస్తారా?