2000 Notes: బ్యాంకుల్లో చేరిన 76% నోట్లు, జనం దగ్గర ఇంకా ఎన్ని ఉన్నాయంటే?

87 శాతం నోట్లు డిపాజిట్ల రూపంలో అకౌంట్స్‌లోకి చేరాయి. మిగిలిన 13% ఇతర డినామినేషన్స్‌లోకి ప్రజలు మార్చుకున్నారు.

Continues below advertisement

Rs 2000 Notes Exchange: రూ.2,000 డినామినేషన్ కరెన్సీ నోట్లలో ఐదింట నాలుగు వంతుల (4/5) నోట్లు తిరిగి బ్యాంకుల వద్దకు చేరాయి. జూన్ 30 నాటికి, 2.72 లక్షల కోట్ల రూపాయల విలువైన రూ. 2 వేల నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. ప్రస్తుతం 84,000 కోట్ల విలువైన పింక్‌ నోట్లు ప్రజల దగ్గర చలామణిలో ఉన్నాయి.

Continues below advertisement

ఈ ఏడాది మే 19న, 2 వేల రూపాయల నోట్లను విత్‌డ్రా చేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. అప్పుడు సర్క్యులేషన్‌లో ఉన్న నోట్ల విలువ 3.56 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు, వాటిలో దాదాపు 76 శాతం నోట్లు బ్యాంకుల బాట పట్టాయి. కేవలం ఒకటిన్నర నెలల్లోనే ఇది సాధ్యమైంది.

ఆర్‌బీఐ డేటా ప్రకారం, ఇప్పటి వరకు బ్యాంకుల వద్దకు వచ్చిన 2.72 లక్షల కోట్ల రూపాయల విలువైన రూ. 2 వేల నోట్లలో 87 శాతం నోట్లు డిపాజిట్ల రూపంలో అకౌంట్స్‌లోకి చేరాయి. మిగిలిన 13% ఇతర డినామినేషన్స్‌లోకి ప్రజలు మార్చుకున్నారు.

తొలి నెల రోజుల్లోనే 2/3 వంతు నోట్లు వెనక్కు
2 వేల రూపాయల నోట్ల ఉపసంహరణ ప్రకటించిన తొలి నెల రోజుల్లోనే 2/3 వంతు నోట్లు జనం నుంచి రిటర్న్‌ అయ్యాయి. ఈ మొత్తంలో 85 శాతం డిపాజిట్లుగా, మిగిలినవి ఎక్సేంజ్‌ కోసం బ్యాంకుల వద్దకు చేరాయి.

ప్రస్తుతం ఉన్న రూ.2,000 నోట్లలో 89 శాతాన్ని 2017 మార్చికి ముందు జారీ చేశారు. వాటి అంచనా జీవిత కాలం నాలుగు-ఐదు సంవత్సరాలు. ఆ గడువు ఇప్పుడు ముగింపులో ఉంది. సెంట్రల్ బ్యాంక్ ప్రింటింగ్‌ ప్రెస్‌లు 2018-19లోనే 2,000 నోట్ల ముద్రణ బంద్‌ చేశాయి.

“క్లీన్ నోట్ పాలసీ”లో భాగంగా రూ. 2,000 కరెన్సీ నోట్లను ఉపసంహరించుకున్నట్లు RBI ప్రకటించింది. నోట్ రీకాల్ వల్ల ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం కనిపించడం లేదని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గతంలో చెప్పారు.

2016 నవంబర్‌లో, రూ. 1000, రూ. 500 కరెన్సీ నోట్లను రాత్రికి రాత్రే రద్దు (demonetisation) చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ తర్వాత మార్కెట్‌లో కరెన్సీ కొరత రాకుండా రూ. 2,000 కరెన్సీ నోట్లను లాంచ్‌ చేశారు.

రూ.2 వేల నోట్లను కూడా రద్దు చేస్తారా?
ప్రజల వద్ద ఉన్న రూ.2,000 నోట్లను బ్యాంక్‌ల్లో మార్చుకోవడానికి లేదా అకౌంట్లలో జమ చేయడానికి ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు టైమ్‌ ఉంది. ఆ గడువు వరకు 2,000 డినామినేషన్ నోట్లు చట్టబద్ధమైన కరెన్సీగా కొనసాగుతాయి. సెప్టెంబరు 30 తర్వాత ఆ నోట్లను రద్దు చేయాలని తాను ప్రభుత్వాన్ని కోరతానో, లేదో తనకు ఖచ్చితంగా తెలీదని కూడా ఆర్‌బీఐ గవర్నర్‌ గతంలో చెప్పారు.

ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను వదిలించుకోవడానికి బ్యాంకులతో పాటు షాపింగ్‌ మాళ్ల బాట కూడా పట్టారు. ఖరీదైన వస్తువులు, బంగారం, వజ్రాభరణాల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. రెండు వేల నోట్ల కట్టలు పట్టుకెళ్లి రియల్‌ ఎస్టేట్‌లోనూ పెట్టుబడి పెడుతున్నారు. ముఖ్యంగా, ఓపెన్‌ ప్లాట్లు గతంలో కంటే వేగంగా చేతులు మారుతున్నాయి.

వినియోగం పెరగడం వల్ల ఆర్థిక వ్యవస్థకు బూస్ట్‌ దొరుకుతుందని, గతంలో అంచనా వేసిన 6.5 శాతానికి పైగా వృద్ధి చెందుతుందని ఆర్‌బీఐ లెక్కలు వేసింది.

మరో ఆసక్తికర కథనం: మస్క్‌ మామ నం.1 - డబ్బులు పోగొట్టుకున్న అదానీ

Join Us on Telegram: https://t.me/abpdesamofficial  

Continues below advertisement