కళ్ళు తెరచి తుమ్మితే కనుగుడ్లు బయటకు వస్తాయని చిన్నప్పుడు చెప్పేవారు. ఆ భయంతో చాలామంది తుమ్ము వచ్చేప్పుడు కళ్లు మూసుకుంటారు. అంతేకాదు.. కళ్లు తెరిచి తుమ్మడం కూడా సాధ్యం కాదు. అయితే, తరతరాలుగా ఈ నమ్మకం భయపెడుతూనే ఉంది. అందుకే, పరిశోధకులు దీనిపై ఒక క్లారిటీ ఇచ్చారు. కళ్లు తెరిచి తుమ్మితే కనుగుడ్లు బయటకు వస్తాయనే ప్రచారం కేవలం ఒక అపోహ మాత్రమే అని తెలిపారు. అసలు తుమ్ము వెనకున్న మెకానిజం ఏమిటి? తుమ్మినపుడు మనం ఎందుకు కళ్లు మూసుకుంటాము? ఈ ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం.
కళ్లు తెరచి తుమ్మి చూద్దామా?
కళ్లు తెరచి తుమ్మేందుకు ప్రయత్నించి చూడండి ఈ సారి. మీరు కచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఎందుకంటే తుమ్మే సమయంలో కళ్లు మూసుకోవడం అనేది ఒక అసంకల్పిత ప్రతీకార చర్య వంటిది. ఈ రకమైన చర్యను అటానమిక్ రిఫ్లెక్స్ అంటారు. ఇటేవంటి చర్యలు మన అదుపులో ఉండవు. కళ్లు తెరచి తుమ్మడం అసాధ్యం కాదు కానీ సులభం కాదు. దానికి చాలా గట్టి ప్రయత్నం చెయ్యాల్సి ఉంటుంది.
తుమ్మితే కళ్లెందుకు మూసుకోవాలి?
ఈ విషయం గురించి వివరించేందుకు కచ్చితమైన క్లినికల్ డేటా అందుబాటులో లేదనే చెప్పాలి. తుమ్ము వల్ల మన శరీరం నుంచి బయటకు చిందే తుంపరలు కళ్లలో పడకుండా అనే లాజిక్ ఒకటి ప్రాచూర్యంలో ఉంది. అసలు ఇలా అసంకల్పితంగా ఎందుకు కళ్లు మూసుకుంటాము అనే విషయాలు తెలుసుకునేందుకు మరింత పరిశోధన అవసరం అవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.
అసలెందుకు తుమ్ముతాం?
తుమ్మును వైద్య పరిభాషలో స్టెర్న్కూటేషన్ అంటారు. ముక్కులోపలి భాగంలో ఇరిటేషన్ కలిగినపుడు కలిగే ప్రతిస్పందనగా చెప్పవచ్చు. గంటకు 100 మైళ్ల వేగంతో ముక్కు నుంచి గాలి బయటకు రావడం వల్ల గాలిని హఠాత్తుగా, శక్తితో బయటకు విసర్జించే ప్రక్రియగా నిర్వచించవచ్చు.
తుమ్ము ముక్కులోని అవసరం లేని లేదా హాని కారక కణాలను వదిలించుకునే చర్యగా చెప్పుకోవచ్చు. అలాగే దగ్గు గొంతు, ఊపిరితిత్తుల నుంచి హాని కారకాలను బయటకు పంపే చర్యగా చెప్పాలి. తుమ్ము దాదాపుగా లక్ష సూక్ష్మ క్రిములను బయటకు విసర్జిస్తుందని అంచనా.
తుమ్ముకు కొన్ని కారణాలు
- దుమ్ము, పుప్పొడి, చుండ్రు, అలర్జీల వల్ల
- జలుబు, ఫ్లూ వల్ల
- చల్లని గాలి వల్ల
- పొడి గాలి వల్ల
- కాలుష్యం వల్ల
- మిరియాలు, కొత్తిమీర, జీలకర్ర వంటి కొన్ని సుగంధ ద్రవ్యాలు
ఇలా రకరకాల కారణాలతో తుమ్ము రావచ్చు. కనుబొమ్మలను లాగినపుడు లేదా పీకినపుడు తుమ్ము రావచ్చు. కనుబొమ్మలను పీకినపుడు ముఖంలో ఉండే నాడులు ఇరిటేట్ అవుతాయి. అందువల్ల నాసికా నాడిలో ప్రేరణ కలిగి తుమ్ము రావచ్చు.
తుమ్మినపుడు గుండె ఆగుతుందా?
తుమ్మినపుడు సెకండ్ కాలం పాటు గుండె ఆగుతుందని ఒక వాదన ప్రాచూర్యంలో ఉంది. కానీ అది అపోహ మాత్రమేనట. తుమ్మినపుడు గుండె కొట్టుకునే తీరు మనకు ప్రత్యేకంగా తెలుస్తుంది అంతే అని నిపుణులు అంటున్నారు.
తుమ్ము ఆపొద్దు
తుమ్ము ఆపడం అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. తుమ్ము ఆపుకోవడం ఫిజికల్ ఇంజూరీకి కారణం కావచ్చట. తుమ్ము ఆపుకోవడం వల్ల మధ్య చెవి, లోపలి చెవి మీద ఒత్తిడి పెరిగి వినికిడి కోల్పోయే ప్రమాదం ఉందట. డయాఫ్రంకు నష్టం జరగవచ్చు. మెదడు రక్తనాళాలు దెబ్బతినవచ్చు లేదా బలహీన పడవచ్చు. కళ్లలో రక్తనాళాలు చిట్లిపొయ్యే ప్రమాదం కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, తుమ్ముతో జాగ్రత్త.
Also read : నోటికి కాస్త బ్రేక్ ఇవ్వండి గురూ, లేకపోతే దంతాలు పాడవుతాయ్ - ఎందుకో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.