Happy Teachers Day 2024 : మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో పరిచయం అక్కర్లేదు. ఆయనో ఆసాధారణ ప్రజ్ఞాశాలి. రాజనీతి కోవిదుడు, విద్యావేత్త. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా పదవులకే వన్నెతెచ్చిన ‘భారతరత్నం’. ప్రజాస్వామ్య విలువలను నెలకొల్పడంలో, విద్యకు సమాజంలో సమున్నత స్థానాన్ని కల్పించడంలో ఆయన చూపిన ప్రజ్ఞ, చొరవ తనను చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. అందుకే ఆయన పుట్టినరోజును స్మరించుకుంటూ భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రముఖ పండితుడు, ఉపాధ్యాయుడు. రాజకీయ నాయకుడు, ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డు గ్రహీత కూడా. భారతదేశంలో మొదటి ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5, 1962 న జరుపుకున్నారు. అలాగే, రాష్ట్రపతి రాధాకృష్ణన్ అదే సంవత్సరంలో అధికారం చేపట్టారు. ఆయన భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి అయ్యారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆయన తర్వాత రెండవ రాష్ట్రపతిగా సేవలు అందించారు. ఆయన 1962 నుంచి 1967 వరకు భారత రాష్ట్రపతిగా పనిచేశారు. 1965లో ఆయన విద్యార్థులు, స్నేహితులు తన పుట్టినరోజును నిర్వహించడానికి సంప్రదించారు. ఆ సమయంలోనే తన జన్మదిన వేడుకలు కాకుండా ఉపాధ్యాయులందరినీ గౌరవించేలా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరారు.
స్కాలర్ షిప్ ల మీదే చదువు పూర్తి
రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న తమిళనాడులోని తిరుత్తణి గ్రామంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతులు. రాధాకృష్ణన్ తొలినాళ్లు తిరుత్తణి, తిరుపతిలోనే గడిచాయి. తండ్రి స్థానిక జమిందార్ వద్ద సబార్డినేట్ రెవెన్యూ అధికారిగా ఉండటంతో రాధాకృష్ణన్ ప్రాథమిక విద్య తిరుత్తణిలోని కేవీ హైస్కూల్లో జరిగింది. 1896లో తిరుపతిలోని హెర్మన్స్‌బర్గ్ ఎవాంజిలికల్ లూథరన్ మిషన్ స్కూలులోనూ, వాలాజీపేటలోని ప్రభుత్వ హైయర్ సెకండరీ స్కూల్లో జరిగింది. మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో ఫిలాసఫీ చదివారు. ఆయన చదువంతా స్కాలర్‌షిప్‌లతోనే జరిగింది.
పదహారేళ్ల వయసులోనే పెద్దలు కుదిర్చిన తన దూరపు బంధువైన శివకామును వివాహం చేసుకున్నారు. వీరికి గోపాల్ అనే కుమారుడితో పాటు ఐదుగురు కుమార్తెలు కలిగారు. తరువాత మైసూర్ విశ్వవిద్యాలయం, కలకత్తా విశ్వవిద్యాలయంతో సహా పలు ప్రతిష్టాత్మక సంస్థలలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. ఆయన విశేష కృషి కారణంగా ఆంధ్రా యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. అతను తన జీవితకాలంలో అనేక అవార్డులు అందుకున్నారు.
పూజారిని చేద్దామనుకున్న తండ్రి, కానీ రాష్ట్రపతి స్థాయికి..
నిజానికి రాధాకృష్ణన్ తండ్రి వీరాస్వామికి పై ఆయన పై చదువులు చదవడం ఇష్టం ఉండేది కాదు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు కావడంతో తన కొడుకు కూడా ఏదో ఒక దేవాలయంలో పూజారిగా స్థిరపడాలని ఆయన తండ్రి కోరుకున్నారు. అయితే.. తన కుమారుడి అద్భుత ప్రతిభను చూసి ఎంత కష్టమైన పడి తనను పై చదువులు చదివించాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత మనందరికీ తెలిసిన సంగతే.. విద్యావేత్తగా, దార్శనికుడిగా, రాజకీయ నాయకుడిగా విజయవంతమైన ప్రయాణం సాగించి.. చరిత్ర పుటల్లో నిలిచారు. ఆ రోజు రాధాకృష్ణన్ తండ్రి మనసు మార్చుకోకపోతే, ఈ మహానుభావుడు, గొప్ప విద్యావేత్త, దార్శనికుడు, భారతదేశ రాష్ట్రపతిగా మనం చూసేవాళ్ళం కాదేమో.