శాసన, న్యాయవ్యవస్థలు నిర్వహించాల్సిన విధులపై రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు ఏం చేయాలన్నఅంశంపై ‘లక్ష్మణరేఖ’ స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక కోసం ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నేతలు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల సుప్రీంకోర్టు సూచించింది. ఈ క్రమంలో ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. నియామక ప్రక్రియలో న్యాయమూర్తులు జోక్యం చేసుకుంటే మరి న్యాయవ్యవస్థను పట్టించుకునేది ఎవరని వ్యాఖ్యానించారు.
పాలనాపరమైన వ్యవహారాల్లో న్యాయమూర్తులు జోక్యం చేసుకోవడం వల్ల వారిపై విమర్శలు వస్తాయని కేంద్రమంత్రి తెలిపారు. అంతేకాకుండా కేసుల విచారణ సమయంలో న్యాయ సూత్రాల విషయంలో రాజీ పడాల్సి వస్తుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తి పాలనాపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయని చెప్పారు. భవిష్యత్‌లో ఈ వ్యవహారం కోర్టుకు చేరితే ఆ నియామకంలో భాగస్వాములుగా ఉన్న న్యాయమూర్తులు ఏ విధంగా తీర్పులు వెలువరిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది న్యాయ సూత్రాల అంశంలో రాజీ పడినట్టేనని ఇదే విషయాన్ని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొందని కిరణ్ రిజిజు అన్నారు.
ఎలక్షన్ కమిషనర్ల నియామకం గురించి రాజ్యాంగం స్పష్టంగా పేర్కొందని.. దీనిపై పార్లమెంట్ చట్టం చేయాల్సి ఉందని కేంద్రమంత్రి తెలిపారు. అందుకు అనుగుణంగా నియామకాలు జరగాల్సి ఉందని.. అయితే, పార్లమెంట్ అలాంటి చట్టం చేయలేయక పోవడంతో ఈ విషయంలో శూన్యత ఉందని ఆయన అంగీకరించారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించకుండానే... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తులు దేశంలోని కీలక నియామకాల విషయంలో జోక్యం చేసుకుంటుంటే.. న్యాయ వ్యవహారాలు ఎవరు చూస్తారని ప్రశ్నించడం విశేషం. దేశంలో పాలనాపరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయన్న న్యాయశాఖ మంత్రి.. న్యాయమూర్తుల ప్రాథమిక విధి న్యాయ వ్యవహారాలు చూసి తీర్పులు వెలువరించడం ద్వారా ప్రజలకు న్యాయం చేయడమేనని తేల్చిచెప్పారు.