Kerala Trekker Rescued: కేరళలో కొండ అంచు చీలికలో చిక్కుకుపోయిన యువకుడిని భారత ఆర్మీ విజయవంతంగా రక్షించింది. దాదాపు రెండు రోజుల తరువాత యువకుడు బాబు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మంగళవారం సాయంత్రం నుంచి అధికారులు, నేటి ఉదయం నుంచి భారత ఆర్మీ చేస్తున్న రెస్క్యూ ఆపరేషన్ తాజాగా విజయవంతమైంది. ట్రెక్కింగ్‌కు వెళ్లి రెండు రోజులుగా కొండపైనే చిక్కుకున్న యువకుడ్ని రక్షించిన భారత ఆర్మీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఆర్.బాబు (23) అనే యువకుడు కేరళలోని పాలక్కడ్ జిల్లా మలంపుజకు ముగ్గురు మిత్రులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. పైకి వెళ్లే కొద్దీ బాగా అలసిపోయి బాబు స్నేహితులు మధ్యలోనే ఆగిపోయారు. కానీ బాబు మాత్రం ఆగకుండా కొండపై భాగానికి చేరుకున్నాడు. తిరిగి వచ్చే క్రమంలో జారిపోయాడు. అదృష్టవశాత్తూ బాబు కొండపై నుంచి కింద పడిపోలేదు. కానీ రెండు బండరాళ్ల మధ్య చీలికలో చిక్కుకుపోయాడు. ఈ విషయాన్ని అతడి స్నేహితుల నుంచి తెలుసుకున్న అధికారులు కాపాడేందుకు యత్నించి విఫలమయ్యారు. ఈ క్రమంలో సీఎం పినరయి విజయన్ సాయం కోరడంతో ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది.
మంగళవారం సాయంత్రం నుంచి అధికారులు ప్రయత్నించగా.. వీరికి బెంగళూరు నుంచి పారాచ్యూట్ రెజిమెంట్ కు చెందిన 22 మంది భారత ఆర్మీ బృందం తోడైంది. అన్ని రకాల ఎక్విప్ మెంట్‌తో నేటి ఉదయం ఆర్మీ మొదలుపెట్టిన రెస్క్యూ ఆపరేషన్ కొన్ని గంటల్లో విజయవంతమైంది. ముందు డ్రోన్ల ద్వారా యువకుడికి ఆహారం, నీరు పంపించారు. ధైర్యం చెబుతూ కొన్ని గంటల్లోనే యువకుడ్ని కొండ చీలిక నుంచి బయటకు తీసుకొచ్చారు. తనను ప్రాణాలతో రక్షించిన భారత ఆర్మీకి యువకుడు బాబు ధన్యావాదాలు తెలిపాడు. ఇప్పుడు ఇందుకు సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: India Corona Cases: భారత్‌లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, తాజాగా 1,217 మంది మృతి