Kerala Buses Owner: కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాయి. భారత్‌లోనూ ఎన్నో లక్షల కుటుంబాలు కరోనా దెబ్బకు విలవిల్లాడిపోయాయి. కొన్ని రకాల వ్యాపారం చేసే వారు లాభాలు ఆర్జిస్తే, మరికొందరు వ్యాపారులు పూర్తిగా నష్టపోయి రోడ్డు మీద పడ్డారు. ముఖ్యంగా పర్యాటక రంగానికి కరోనా తీవ్ర నష్టాలను మిగిల్చింది. కేరళకు చెందిన టూరిస్ట్ బస్సుల ఓనర్ కరోనా వ్యాప్తి సమయంలో తీవ్రంగా నష్టపోయి కీలక నిర్ణయం తీసుకున్నారు.


బస్సులను తుక్కు కింద విక్రయించాలని నిర్ణయం తీసుకోవడం ఆర్థిక సమస్యలకు అద్దం పడుతోంది. కేరళకు చెందిన రాయ్‌సన్ జోసెఫ్ టూరిజానికి సంబంధి వ్యాపారం చేస్తున్నారు. ఆయన వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు 20 వరకు ఉండేవి. కరోనా సమయంలో నిబంధనల కారణంగా ట్రావెల్స్ రంగానికి భారీ షాక్ తగిలింది. భారీగా నష్టపోయిన జోసెఫ్ ఇక బస్సులను భరించడం తన వల్ల కాదని ఇదివరకే 10 బస్సులను తుక్కు కింద విక్రయించాడు. కేవలం కేజీ రూ.45 చొప్పున తుక్కు కింద ట్రావెల్స్ బస్సులను అమ్మేశారు.


కోచి కేంద్రంగా రాయ్ అనే పేరుతో ట్రావెల్స్ సేవలు అందించేవారు. కానీ కరోనా వ్యాప్తి తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత కోవిడ్ నిబంధనలతో బస్సులను నడిపినా అసలు పెట్టుబడి కూడా చేతికి రాకపోవడంతో బస్సులను స్క్రాప్ చేసి విక్రయిస్తున్నాడు. గత ఏడాది కరోనా వ్యాప్తి తగ్గిన అనంతరం టూరిజం మళ్లీ పుంజుకుని నష్టాలు పూడ్చుకోవచ్చునని భావించిన ఎంతో మంది ఈ రంగాన్ని నమ్ముకున్న వారికి తీవ్ర నిరాశే ఎదురైంది. అందులో రాయ్ సన్ జోసెఫ్ ఒకరు.


తన వద్ద ఉన్న మిగతా బస్సులను సైతం కేజీ రూ.45కు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారని కాంట్రాక్ట్ క్యారేజ్ ఆపరేషన్స్ అసోసియేషన్ కేరళ (Contract Carriage Operators Association Kerala) తెలిపింది. ట్రావెల్స్ నిర్వహిస్తున్న చాలా మంది పరిస్థితి ఇలాగే ఉందని, వేల సంఖ్యలో బస్సులు తగ్గిపోయాయని పేర్కొంది. బస్సులకు సంబంధించి లోన్లు తిరిగి చెల్లించడానికి కొన్ని బస్సులను ఇదివరకే బ్యాంకులు, కంపెనీలు సీజ్ చేశాయి. కుటుంబాన్ని పోషించుకునేందుకు దిక్కు తోచని పరిస్థితుల్లో మిగతా బస్సులను కూడా స్క్రాప్ చేసి తుక్కు కింద విక్రయిస్తున్నారు. తన వద్ద పనిచేసే ఉద్యోగుల పరిస్థితి కూడా దారుణంగా ఉందని, కానీ ఇక ఈ బస్సులను నడిపే అవకాశం లేదని వాపోయారు.


రాయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కో బస్సుకు రూ.40 వేల వరకు పన్నులు చెల్లించేవాడ్ని. పన్నులు, ఇన్సురెన్స్, ఇంధనం ఇలా మొత్తం ఒక్కో బస్సుకు రూ.80 వేలు చెల్లించాను. కానీ అధికారులు ఏదో ఓ కారణం చూపించి నా బస్సులను నిలిపివేస్తున్నారు. అందుకే బస్సులను అమ్మక తప్పడం లేదన్నారు. 


Also Read: Bank Fraud Cases India: బ్యాంకులకు రూ.22వేల కోట్ల షాక్‌ - దేశంలో అతిపెద్ద బ్యాంకు మోసాలివి!


Also Read: Anantapur Love Story: ఈ మట్టిని తాకితే ప్రేమ సక్సెస్, భగ్న ప్రేమికుల యథార్థగాథ మీకు తెలుసా ?