ప్రేమ, ప్రేమికులు.. ఆ పదాలు వింటే చాలు అందరికీ రోమియో జూలియట్, సలీం అనార్కలి, పార్వతి దేవదాస్, లైలా మజ్నూ ఇలాంటి ఎన్నో కాంబినేషన్లు గుర్తుకొస్తాయి. అమర ప్రేమికుల జాబితాలో వీరు పేర్లు చిరస్థాయిగా నిలిచిపోయాయి. భగ్న ప్రేమికులు అనే అంశం  చర్చకు వస్తే చాలు ఈ జంటల పేర్లే గుర్తుకు వస్తాయి. చరిత్రకారులు, కవులు వీరి ప్రేమ కథలకు అగ్ర తాంబూలం ఇవ్వడంతో నేటికీ వీరి పేర్లు తలుస్తూనే ఉంటాము.


ప్రేమ సఫలంకాక ఎంతో మంది ప్రాణ త్యాగం చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. చాలా ఘటనలకు ప్రాచుర్యం లేక చరిత్ర శిథిలాల కింద మసకబారిపోయాయి. చరిత్రకారుల చిన్న చూపో ఏమో తెలియదు, అలాగే అప్పటి కవుల కలానికి వీరి చరిత్ర కానరాలేదో ఏమో తెలియదు గానీ.. రాయలసీమలోని అనంతపురం జిల్లా కదిరిలో చోటుచేసుకున్న ఓ యదార్థ ఘటన వెలుగులోకి రాకుండా చీకట్లోనే మగ్గుతోంది. ఇష్టపడిన వారి కోసం ప్రాణాలు అర్పించిన సంఘటన  దురదృష్టవశాత్తు వారి సమాధుల వద్దే ముగిసిపోయింది . ఇలాంటి భగ్న ప్రేమికుల చరిత్ర ను వెలికి తీసే ప్రయత్నమే ఈ స్టోరీ.


శతా బ్దాల కిందట కదిరి నరసింహ స్వామి దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు జరుగుతున్న రోజులు. ఓ రోజు వేకువ జమున పట్టు వస్త్రాలలో స్వామివారి దర్శనానికి ఓ యువతి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తోంది. అదే సమయంలో ఓ యువకుడు ఆమెను చూశాడు. దృష్టి మరల్చుకోలేని లావణ్యం ఆమెది. బండి చక్రాల్లాంటి కళ్ళు, చిరు  గాలికి కదులుతున్న ఆమె ముంగురులు , సరికొత్త సవ్వడులు చేస్తున్న ఆమె కాలి అందెలు, పట్టు వస్త్రాల లో బంగారు ఆభరణాలు ధరించి దివి నుండి భువికి దిగివచ్చిన దేవకన్య లాగా అనిపించింది ఆ యువకుడికి.  ఇంకేముంది తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడు. 


ఆ అమ్మాయి అప్పటి పట్నం పాలెగాళ్ళ గారాలపట్టి చంద్రవదన. పేరుకు తగ్గట్టే అందాలరాశి.  ఆ యువకుడు పర్షియా దేశస్థుడు. అదేనండి ఇప్పటి  ఇరాన్ దేశం అన్నమాట. అక్కడి నుంచి వజ్రాల వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చాడు. అతని పేరు మోహియార్. చంద్రవదన ను చూసిన రోజు నుంచి ఆమె ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లేవాడు. మోహియార్ తనను ఫాలో చేయడం గమనించిన చంద్రవదన కూడా అతని ప్రేమలో పడిపోయింది. ఎన్నోసార్లు కలుసుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. కొన్ని సందర్భాలలో స్నేహితుల ద్వారా సందేశాలు పంపుతున్నారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు పంచుకోగలిగారు.


ఇక ఆలస్యం చేయకూడదని తమ ప్రేమను పెద్దల ముందు బహిర్గతం చేశాడు మోహియార్. అయితే శతాబ్దాల క్రితం మాట కాబట్టి కట్టుబాట్లు మరింత కఠినంగా ఉండేవి. దీంతో యధావిధిగా వారి ప్రేమ తిరస్కరణకు గురైంది. తమ ఇంటి ఆడపడుచు వేరే దేశానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేయడం ఇష్టంలేక కనీసం ఆమె బయటకు రాకుండా భద్రత కట్టుదిట్టం చేశారు పట్నం పాలేగాళ్ళు. దీంతో ఒకరిని ఒకరు చూడకుండా ఉండలేకపోయారు. ఒకరి కోసం ఒకరు నిద్రాహారాలు మానేసి సంవత్సరం పూర్తయింది. ఫలితంగా ఆరోగ్యం క్షీణించి,  ఆమె కోసం పరితపించిన మోహియార్ తనువు చాలించాడు.


చంద్రవదన కూడా  మోహియార్ మీద ఉన్న ప్రేమతో శ్వాస విడిచింది. దీంతో ఈ వార్త దావానలంలా వ్యాపించి కదిరి ప్రాంతమంతా శోక సముద్రంలో మునిగిపోయింది. భౌతికంగా కలసి జీవించ లేని వారి సమాధులు అయినా ఒకే చోట ఏర్పాటు చేయాలన్న తలంపుతో కదిరి పట్టణంలోని ఓ చోట వారి మృతదేహాలను ఖననం చేశారు. అనంతరం వారి పవిత్ర ప్రేమ భావితరాలకు అందాలన్న సదుద్దేశంతో వారి సమాధులను నిర్మించారు. ఎంతో మంది యువతీ యువకులు సమాధులను దర్శించుకునేవారు.


ఈ సమాదుల వద్ద మట్టిని తాకితే తమ ప్రేమ ఫలిస్తుందన్న నమ్మకం ప్రజలలో ప్రగాఢంగా ఉండేది. ఎంతోమంది సమాధులు దర్శించి మట్టిని తాకిన తర్వాత ప్రేమ సఫలం అయిందన్న కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే కాలగర్బంలో ఈ చరిత్ర కలిసిపోతోంది. రానురాను సందర్శకుల తాకిడి కూడా తగ్గిపోయింది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ అనేకమంది తమ పిల్లలకు చంద్రమోహియార్ అన్న పేర్లను పెట్టుకొని ఆ భగ్న ప్రేమికులను ఇప్పటికీ తలచుకుంటూనే ఉన్నారు.


Also Read: Sarva Darshan Tickets: ఆఫ్లైన్‌లో తిరుమలేశుడు సర్వదర్శనం టోకెన్లు, ఎన్ని జారీ చేస్తుందంటే?


Also Read: Chiranjeevi - Tammareddy: పరువు తీశావయ్యా చిరంజీవి, జ‌గ‌న్‌ను అడుక్కోవాలా? తమ్మారెడ్డి ఘాటు వ్యాఖ్యలు