Biggest Bank Scams in India: ఎంత పకడ్బందీగా తనిఖీలు చేస్తున్నా, ఎంత పక్కాగా పరిశీలిస్తున్నా బ్యాంకు మోసాలు ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా దేశంలోనే అతిపెద్ద బ్యాంకు మోసం బయటపడింది. ఏబీజీ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ 28 బ్యాంకులను రూ.22వేల కోట్ల మేర మోసం చేయడంతో అలజడి చెలరేగింది. ఈ నేపథ్యంలో టాప్‌-3 బ్యాంకు మోసాల వివరాలు ఇవే!! 


ఏబీజీ అతిపెద్ద మోసం


Abg shipyard fraud: తాజాగా దేశంలోనే అతిపెద్ద బ్యాంకు మోసం బయటపడింది. నౌకలు, వెసెల్స్‌ను తయారుచేసే ఏబీజీ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ 28 బ్యాంకులను రూ.22,848 కోట్ల మేరకు మోసం చేసిందని సీబీఐ కేసు నమోదు చేసింది. కంపెనీ ఎండీ రుషి కమలేశ్‌ అగర్వాల్‌, మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంతానం ముతుస్వామి, డైరెక్టర్లు అశ్విని కుమార్, సుశిల్‌ కుమార్‌ అగర్వాల్‌, రవి విమల్‌ నివేతియాపై కేసులు నమోదు చేసింది. సూరత్‌, ముంబయి, పుణె సహా 13 ప్రదేశాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది. 2016లో ఈ కంపెనీ రుణాలను స్థూల నిరర్థక ఆస్తులుగా బ్యాంకులు ప్రకటించాయి. 2019, నవంబర్‌ 8న సీబీఐ వద్ద ఫిర్యాదు చేశాయి. ఆడిటింగ్‌ సహా ఇతర నివేదికలను తనిఖీ చేయడంతో బ్యాంకులు ఇచ్చిన రుణాలను ఇతర  కార్యకలాపాలకు మళ్లించినట్టు తేలింది. దాంతో మోసం, విశ్వాస రాహిత్యం సహా ఇతర కేసులు నమోదయ్యాయి. ఎస్‌బీఐకి రూ.2,925 కోట్లు, ఐసీఐసీఐకి రూ.7,089 కోట్లు, ఐడీబీఐకి రూ.3,634 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు రూ.1614 కోట్లు, పీఎన్‌బీకి రూ.1244 కోట్లు, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకుకు రూ.1128 కోట్లు ఏబీజీ షిప్‌యార్డ్‌ బాకీ పడింది.


వజ్రాలు కొంటామని!





Nirav modi pnb Scam: బ్యాంకింగ్‌ వ్యవస్థలోని లోపాలను అడ్డుపెట్టుకొని నీరవ్‌ మోదీ చేసిన మోసం 2018లో బయటపడటంతో దేశమంతా ఉలిక్కిపడింది. లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌ను ఉపయోగించుకొని రూ.11,400 కోట్ల వరకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోసం చేశారు. నీరవ్‌ మోదీ, అతడి బంధువు మెహుల్‌ చోక్సీ, ఇద్దరు పీఎన్‌బీ అధికారులు ఈ మోసంలో భాగస్వాములు. దాంతో అతడిపై మోసం, అవినీతి, మనీ లాండరింగ్‌, ఎగవేత కేసులు నమోదయ్యాయి. ముంబయిలోని బ్రాడీ హౌజ్‌ పీఎన్‌బీ శాఖ నీరవ్‌కు ఎల్‌ఓయూలు ఇచ్చేది. దాంతో విదేశాల్లోని భారతీయ బ్యాంకులను ఉపయోగించుకొని ఏడాది గ్యారంటీతో అక్కడి నుంచి వజ్రాలు దిగుమతి చేసేవారు. ఆర్‌బీఐ ప్రకారం ఈ గడువు కేవలం 90 రోజులే. ఈ నిబంధనను విదేశాల్లోని బ్యాంకు శాఖలు పాటించలేదు. స్విఫ్ట్‌ పాస్‌వర్డ్‌లు ఉపయోగించి చేసిన ఈ మోసం బయటపడగానే నీరవ్‌ మోదీ విదేశాలకు పారిపోయారు. ఆయన పైనా లండన్‌ కోర్టులోనే విచారణ జరుగుతోంది. నీరవ్‌ మోదీకి సంబంధించిన వ్రజాలు, ఇతర ఆస్తులను బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయి.


దాదాపుగా పాపం పండింది!


Vijay mallya bank fraud case : మంచి కాలం నడిచేటప్పుడు ఎవరైనా రాజే! అందుకు లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యానే ఉదాహరణ. దేశంలోని సంపన్నుల్లో ఒకరిగా విలాసవంతమైన జీవితం గడిపిన ఆయనకు 2016 నుంచి గడ్డు రోజులు మొదలయ్యాయి. దాంతో ఆయన దేశం నుంచి పారిపోయారు! మద్యపానం తయారీలో విజయవంతం అయినా ఆయన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ను నడపడంలో విఫలమయ్యారు. త్వరలోనే ఇది నష్టాల్లోకి చేరుకోవడంతో వ్యాపారం నిర్వహణకు వివిధ బ్యాంకుల నుంచి రూ.9000 కోట్లు అప్పు చేశారు. లాభాల్లోకి రాకపోవడంతో అప్పులు చెల్లించలేకపోయారు. ఎగవేతదారుగా ముద్రపడిపోయారు.


రుణాలు చెల్లించకపోవడంతో మాల్యాపై కేసులు నమోదయ్యాయి. ఒత్తిడి పెరిగిపోయింది. దాంతో ఆయన లండన్‌కు పారిపోయారు. ఎస్‌బీఐ నేతృత్వంలో బ్యాంకులన్నీ ఒక కన్సా ర్షియంగా ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అతడిని స్వదేశం తీసుకొచ్చేందుకు పోరాడుతోంది. ఆయనపై వచ్చిన కేసులను లండన్‌ కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. మనీ లాండరింగ్‌; ఈడీ కేసులు పడ్డాయి. రికవరీలో భాగంగా బ్యాంకులు అతడికి చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. అతడు డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెబుతున్నా పరిస్థితులు అనుకూలంగా ఉండటం లేదు. ఈ మధ్యే అతడిని లండన్‌ కోర్టు దివాళాదారుగా ప్రకటించింది. దాంతో ప్రపంచంలో మాల్యాకు ఎక్కడ ఆస్తులు ఉన్నా వాటిని స్తంభింపజేసి తమ బకాయిలను రాబట్టుకొనేలా ఉత్తర్వులు పొందేందుకు బ్యాంకులకు మార్గం సుగమమైంది.