మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఖిలాడి' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. కొందరు మాత్రం ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై కేసు నమోదైంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రతన్ జైన్ ఈ సినిమా దర్శకనిర్మాతలపై కేసు పెట్టారు. 'ఖిలాడి' టైటిల్ తనకు సంబంధించినదని.. 1992లో అక్షయ్ కుమార్ హీరోగా ఈ టైటిల్ తో సినిమా కూడా రిలీజ్ చేసినట్లు చెప్పారు.
ఈ ఇష్యూ సెటిల్ అయ్యేవరకు సినిమా ఓటీటీ రిలీజ్ ను ఆపాలంటూ నిర్మాత జైన్ కోర్టుకి వెల్లడించారు. ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడిన రతన్ జైన్.. రవితేజ 'ఖిలాడి' సినిమా టైటిల్ మార్చాలని.. ఎందుకంటే ట్రేడ్ మార్క్ యాక్ట్ కింద తను ఆల్రెడీ టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు చెప్పారు. ఈ విషయంలో తను డబ్బు ఏమీ ఆశించడం లేదని.. తన 'ఖిలాడి' సినిమా ప్రతిష్ట గురించే ఆలోచిస్తున్నానని చెప్పారు.
దక్షిణాదిన లోకల్ అసోసియేషన్స్ లో టైటిల్స్ రిజిస్టర్ చేయించి.. అదే టైటిల్ తో వారి సినిమాలను హిందీలో రిలీజ్ చేస్తున్నారని అన్నారు. CBFC(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్) హిందీ సినిమా తరహా టైటిల్స్ తో ఉన్న డబ్బింగ్ సినిమాలను దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి పర్మిషన్ ఇవ్వడం వలనే ఇలా జరుగుతుందని.. ఇదివరకు ఇలాంటి పరిస్థితి ఇలా ఉండేది కాదని అన్నారు.
సౌత్ ఇండస్ట్రీలో 'ఖిలాడి' అనే టైటిల్ తో సినిమా తెరకెక్కుతుందనే విషయం కూడా తనకు తెలియదని.. రీసెంట్ గా ట్రైలర్ చూసిన తరువాత విషయం తెలిసిందని అన్నారు. వెంటనే కోర్టుని సంప్రదించినట్లు చెప్పారు. కానీ మెజిస్ట్రేట్ ఈ సమయంలో సినిమా రిలీజ్ ఆపడం కష్టమన్నారని చెప్పారు. కాబట్టి ఓటీటీ రిలీజ్ ను ఆపాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ సినిమా హిందీ మార్కెట్ లో రిలీజ్ అవుతున్న విషయం కూడా తనకు తెలియదని అన్నారు. ఇప్పటివరకు రవితేజ అండ్ టీమ్ ఈ విషయంపై ఇంకా స్పందించలేదు.