Special Portal For Sabarimala Ayyappa Easy Darshan: శబరిమల (Sabarimala) అయ్యప్ప భక్తులకు కేరళ పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారు. మండలం - మకరవిళక్కు వార్షిక యాత్ర సందర్భంగా స్వామి దర్శనానికి వచ్చే వారికి సులభంగా దర్శనమయ్యేందుకు వీలుగా ప్రత్యేక పోర్టల్‌ను ప్రవేశపెట్టారు. 'శబరిమల - పోలీస్ గైడ్' (Police Guide) అనే ఈ పోర్టల్ ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉంటుంది. ఇందులో భక్తులకు ఉపయోగపడే ముఖ్యమైన సమాచారం అంతా పొందుపరిచారు. పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్లు, పీఎస్ ఫోన్ నెంబర్లు, ఆర్టీసీ సేవలు, ఆరోగ్య సేవలు, అంబులెన్స్, అగ్నిమాపక దళం, ఫుడ్ సేఫ్టీకి చెందిన సమాచారం మొత్తం ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు శబరిమల హిస్టరీ, వాహనాల పార్కింగ్, ప్రతి జిల్లా నుంచి శబరిమలకు ఉన్న విమాన, రైలు, రోడ్డు మార్గాల వివరాలను సైతం ఈ పోర్టల్‌లో పొందుపరిచినట్లు పోలీసులు తెలిపారు.
నటుడికి వీఐపీ దర్శనం - తప్పుబట్టిన హైకోర్టు
మరోవైపు, అయ్యప్ప క్షేత్రంలో ఓ నటుడికి వీఐపీ దర్శనం కల్పించడాన్ని కేరళ హైకోర్టు తప్పుబడుతూ.. ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మలయాళ నటుడు దిలీప్ (Actor Dileep) గురువారం శబరిమల అయ్యప్పను దర్శించుకోగా.. టీడీబీ ఆయనకు వీఐపీ దర్శనం కల్పించింది. ఈ సమయంలో భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సి వచ్చింది. దీనిపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించిన హైకోర్టు విచారించింది. ఆయన వల్ల పిల్లలు, వృద్ధులు సహా ఇతర భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూడాల్సి వచ్చిందని పేర్కొంది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి మాత్రమే వీఐపీ దర్శనం కల్పించాల్సి ఉంటుందని.. ఇతరులకు ప్రత్యేక దర్శనం కల్పించడం నిబంధనలకు విరుద్ధమని టీడీబీపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారంలోగా దీనికి సంబంధించి వీడియో ఫుటేజీ, దర్యాప్తు నివేదికను సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
అటు, తెలుగు రాష్ట్రాల నుంచి భక్తుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే 64 ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా.. మరో 28 ప్రత్యేక సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌లోని మౌలాలి నుంచి కొల్లం, కాచిగూడ నుంచి కొట్టాయం, కాకినాడ టౌన్ నుంచి కొల్లం, నర్సాపూర్ నుంచి కొల్లం వరకూ ఈ రైళ్లు నడపనున్నారు. డిసెంబర్ 11 నుంచి జనవరి 29 వరకూ నిర్ణీత తేదీల్లో ఈ రైళ్లు సర్వీసులందించనున్నాయి. ఈ రైళ్ల అడ్వాన్స్ బుకింగ్స్ శుక్రవారం (డిసెంబర్ 6) ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతాయని అధికారులు వెల్లడించారు.
- డిసెంబర్ 11, 18, 25 తేదీల్లో ప్రత్యేక రైలు (07193) మౌలాలి నుంచి కొల్లం, కొల్లం నుంచి మౌలాలి వరకూ ప్రత్యేక సర్వీసు (07194) డిసెంబర్ 13, 20, 27 తేదీల్లో నడపనున్నారు.
- డిసెంబర్ 14, 21, 28 తేదీల్లో ప్రత్యేక సర్వీసు (07149) మౌలాలి నుంచి కొల్లం వరకూ, డిసెంబర్ 16, 23, 30 తేదీల్లో (07150) నడపనున్నారు.
- జనవరి 2, 9, 16, 23 తేదీల్లో (రైలు నెం. 07151) కాచిగూడ నుంచి కొట్టాయం వరకూ.. జనవరి 3, 10, 17, 24 వరకూ రైలు నెం 07152 కొట్టాయం నుంచి కాచిగూడ వరకూ రైలు నడవనుంది.
- జనవరి 6, 13 తేదీల్లో కాకినాడ టౌన్ నుంచి రైలు నెం. 07155.. జనవరి 8, 15 తేదీల్లో రైలు నెం. 07156 వరకూ నడపనున్నారు. జనవరి 20, 27 తేదీల్లో నర్సాపూర్ నుంచి కొల్లం వరకూ రైలు నెం. 07157.. కొల్లం నుంచి నర్సాపూర్ వరకూ జనవరి 22, 29 తేదీల్లో రైలు నెం.07158 సర్వీస్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Also Read: Pawan On Bangladesh: బంగ్లాదేశ్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం - అందరూ మాట్లాడాల్సిన సమయం వచ్చిందని పిలుపు