Janasena chief Pawan Kalyan made a sensational tweet on the issue of Bangladesh: ఇస్కాన్‌కు చెందిన బంగ్లాదేశ్ స్వామి చిన్మయ్ కృష్ణ ప్రభు విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఆయనను అరెస్టు చేశారు. తమ దేశానికి వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొడుతున్నారన్న కారణంగా చిన్మయ్ కృష్ణ ప్రభును అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టింది. ఆయనకు ఎలాంటి న్యాయపరమైన సాయం చేయడం లేదు. జైల్లో ఆయనను హింసిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ఆయనకు మద్దతుగా గతంలోనూ మాట్లాడారు. తాజాగా మరోసారి ఆయన చిన్మయ్ కృష్ణ ప్రభు కోసం ప్రపంచం అంతా స్పందించాల్సిన అవసరం ఉందని పిలుపునిస్తూ సుదీర్ఘమైన ట్వీట్ పెట్టారు. 


ముంబై దాడుల్లో పట్టుబడిన అత్యంత క్రూరమైన ఉగ్రవాది కసబ్ విషయంలో భారత్ అత్యంత ప్రజాస్వామ్యంగా వ్యవహరించిందని అన్ని రకాల న్యాయ సాయాలు కూడా అందేలా చూసిందని పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో గుర్తు చేశారు. తన ట్వీట్ లో కేస్ నెంబర్ వన్ గా కసబ్ అంశాన్ని ప్రస్తావించారు. అతను దేశంపై దాడికి వచ్చినప్పటికి అతనికి హక్కుల పరంగా రావాల్సినవి కల్పించారని మంచి భద్రత ఇచ్చారని .. భాషాపరంగా వచ్చే సమస్యలను కూడా అధిగమించేందుకు ఏర్పాట్లు చేసి.. అన్ని అధారాలను ప్రపంచం ముందు పెట్టి శిక్షించారని అన్నారు. భారత్ ఇంత సహనంగా ఓ ఉగ్రవాది విషయంలో వ్యవహరించిన విషయాన్ని ప్రపంచం మొత్తం చూసిందన్నారు. భారత్ లో ఉన్న హ్యూమన్ రైట్స్, సోషల్ టోలరెన్స్, పారదర్శక విచారణ ప్రపంచం మొత్తం చూసిందన్నారు.



ఇక్కడ కేసు నెంబర్ టులో  బంగ్లాదేశ్ అరెస్టు చేసిన చిన్మయకృష్ణ ప్రభు అంశాన్ని పవన్ ప్రస్తావించారు. నోబుల్ పీస్ ప్రైజ్ గెలిచిన మహమ్మద్ యూనస్ నేతృత్వంలో ఉన్న దేశంలో హిందువుల కోసం గొంతెత్తిన చిన్మయ్ కృష్ణ ప్రభును అరెస్టు చేశారని .. దేశ ద్రోహం కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఆయనకు న్యాయపరంగా ఎలాంటి అవకాశాలు లేకుండా చేశారని కోర్టులో కూడా ప్రజెంట్ చేయడం లేదన్నారు. పారదర్శక విచారణకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 


ఈ అంశంపై ఇప్పుడు ప్రపంచం మొత్తం స్పందించాల్సిన అవసరం ఉందని పవన స్పష్టం చేశారు. సూడో సెక్యూలరిస్టులు, మానవహక్కుల చాంపియన్లుగా ప్రకటించుకునేవారు, ప్రపంచ లీడర్లుగా కిరీటాలు పెట్టుకున్నవారు ఇప్పుడు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎందుకు న్యాయం వేరే వేరుగా ఉంటోందని ప్రశ్నించారు. చిన్మయ్ కృష్ణ ప్రభుకు కనీస హక్కులు కల్పించాలని పవన్ డిమాండ్ చేశారు. ప్రపంచం స్పందించాల్సి ఉందని.. మానవత్వం ఈ స్పందనపైనే ఆధారపడి ఉందన్నారు.