Kerala News: ఇటీవల కాలంలో ఫోన్ లు ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువవుతుంది. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్ద వాళ్ల వరకు ప్రతీ ఒక్కరూ ఫొన్ ను ఉపయోగిస్తున్నారు. గేమ్స్ ఆడడం, రీల్స్, పలు వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాగే ఫోన్ కు అలవాటైన ఓ బాలిక ఫోన్ లో ఛార్జింగ్ అయిపోతే.. ఛార్జింగ్ పెట్టి మరీ గేమ్ అడసాగింది. ఇదే ఆమె పాలిట శాపంగా మారింది. ఫోన్ ఒక్కసారిగా పేలడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. భారీ శబ్దం రావడంతో తల్లిదండ్రులు లోపలికి వచ్చి చూసే సరికే బాలిక చనిపోయి కనిపించింది. 


అసలేం జరిగిందంటే..?


కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తిరువిల్వామలలో ఆదిత్య శ్రీ అనే చిన్నారి మొబైల్ ఫోన్ లో తరచుగా వీడియోలు చూస్తుండేది. గేమ్స్ కూడా ఆడుతుండేది. ఈ క్రమంలోనే ఫోన్ లో ఛార్జింగ్ అయిపోగా.. ఛార్జింగ్ పెట్టి మరీ గేమ్ ఆడసాగింది. ఈ క్రమంలోనే ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భాలిక అక్కడికక్కడే చనిపోయింది. గట్టిగా శబ్దం రావడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా.. అప్పటికే బాలిక మరణించింది. తమ నిర్లక్ష్యం వల్లే పాప చనిపోయిందంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఎక్కువ సేపు గేమ్ ఆడడం వల్లే ఫోన్ పేలిందని భావిస్తున్నారు. 


ఫోన్లు ఎందుకు పేలుతాయి?


ఫోన్ పేలడానికి చాలా కారణాలుంటాయి. దీనికి కారణం బ్యాటరీ. ఆధునిక హ్యాండ్‌సెట్‌లు లిథియం అయాన్ బ్యాటరీలతో అమర్చబడి ఉంటాయి. ఇవి సానుకూల, ప్రతికూల ఎలక్ట్రోడ్‌లకు సంబంధించి కచ్చితమైన సమతుల్యతను కలిగి ఉంటాయి. బ్యాటరీ లోపల ఉండే భాగాలు ఏదైనా సమస్యలకు గురైతే పేలుడుకు దారితీసే అవకాశం ఉంది.  


బ్యాటరీలు ఎలా పాడవుతాయి?


అనేక కారణాల వల్ల బ్యాటరీలు పాడవుతాయి. ఎక్కువగా అధిక వేడి కారణంగా చెడిపోతాయి. ఛార్జింగ్ బ్యాటరీ, ఓవర్‌వర్క్డ్ ప్రాసెసర్ చాలా త్వరగా వేడిగా మారితే బ్యాటరీలో సమస్య వస్తుంది. , థర్మల్ రన్‌ అవే అని పిలువబడే చైన్ రియాక్షన్ మూలంగా బ్యాటరీ మరింత ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఫోన్ పేలిపోతుంది.


ఫోన్‌లు పేలిపోయే ముందు వచ్చే హెచ్చరికలు


ఫోన్ పేలిపోయే ముందు మనకు తెలిసే అవకాశం ఉంటుంది. హిస్సింగ్  లేదంటే పాపింగ్ శబ్దాలు వస్తాయి. అదీ కాదంటే, ప్లాస్టిక్ రసాయనాలు మండుతున్న వాసన  వస్తుంది. ఈ సూచనలు ఫోన్ లు పేలిపోయే అవకాశాన్ని సూచిస్తాయి. సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోతే పేలిపోవచ్చు.  ఉబ్బిన బ్యాటరీ కూడా ఒక పెద్ద హెచ్చరికగా భావించవచ్చు. ఎందుకంటే, అది ఇంటర్నల్ గా దెబ్బతిన్నప్పుడు మాత్రమే అలా తయారవుతుంది.   


ఫోన్ పేలకుండా ఆపవచ్చా?


కంపెనీ నుంచి వచ్చిన తప్పు అయితే వినియోగదారులు ఏమీ చేయలేరు. కానీ, మీ ఫోన్ బ్యాటరీపై పెట్టే కొంత లోడ్‌ను తగ్గించడానికి చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. భౌతిక నష్టాన్ని నివారించడానికి ఫోన్ కేస్‌ని ఉపయోగించడం మంచిది. విపరీతమైన ఉష్ణోగ్రతల నుంచి ఫోన్ ను దూరంగా ఉంచాలి. మీరు నిద్రించే ప్రదేశంలో ఫోన్‌ ను ఛార్జింగ్ చేయడం మానేయాలి.  మీ ఫోన్‌ లో 30 నుంచి 80 శాతం బ్యాటరీ లైఫ్ మధ్య ఛార్జ్ చేయడం ఉత్తమం. కంపెనీ సిఫార్సు చేసిన ఛార్జర్‌ లు మాత్రమే వాడాలి.