Kerala Weather:కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో పెను విషాదం నెలకొంది. స్థానికుల సమాచారం మేరకు వందలాది మంది ఇంకా శిథిలాల్లో ఉన్నారు. వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, ముండక్కై పట్టణం, చురాల్ మాల ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున ప్రకృతి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 50 మృత్యువాత పడ్డారు. ఇంకా వందల మంది శిథిలాల్లో చిక్కుకొని ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 


ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ చెప్పినట్టు ఇప్పటి వరకు మృతి చెందినవారిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్టు గుర్తించారు. 100 మంది వరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గల్లంతైన వారి  కోసం గాలింపు చర్యలు శరవేగంగా సాగుతున్నాయని వీణా జార్జ్‌ తెలిపారు. 


మోదీ భరోసా  


వయనాడ్‌లో జరగిన దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం అందజేయనున్నట్టు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేయూత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 


కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటన తనను కలచివేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఆత్మీయులను కోల్పోయిన వారందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అన్నారు. ప్రస్తుతం బాధితులందరినీ ఆదుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో మాట్లాడానని, అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.


పరిహారాన్ని కూడా ప్రధాని మోదీ ప్రకటించారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు. క్షతగాత్రులకు రూ.50వేలు పరిహారం అందజేస్తామన్నారు. 


రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి
కేరళలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'వయనాడ్‌లోని మెప్పాడి సమీపంలో కొండచరియలు విరిగిపడటం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆత్మీయులను కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు. ఇంకా శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని త్వరలోనే సురక్షితంగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.


కేరళ ముఖ్యమంత్రి, వయనాడ్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడానని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. అన్ని ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని, కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని, సహాయక చర్యలకు అవసరమైన సహాయం గురించి తెలియజేయాలని కోరారు. కేంద్రమంత్రులతో మాట్లాడి వయనాడ్‌కు అన్ని విధాలా సాయం అందించాలని కోరతాను అన్నారు. సహాయక చర్యల్లో అధికార యంత్రాంగానికి సహకరించాలని యూడీఎఫ్ కార్యకర్తలందరికీ రిక్వస్ట్ చేశారు. 


భారీ వర్షాల ముంచెత్తడంతో ముండక్కై పట్టణంలో తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో మొదట కొండచరియలు విరిగిపడ్డాయి. అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న టైంలోనే చురల్ మాలలో మరో ప్రమాదం జరిగింది. సుమారు 4 గంటల ప్రాంతంలో చురల్ మాలలోని పాఠశాల సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. వరదబాధితుల కోసం ఏర్పాటు చేసిన శిబిరంతోపాటు సమీపంలోని ఇళ్లు, దుకాణాలన్నీ నీరు, బురదతో నిండిపోయాయి. 


హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు 
బాధితుల కోసం 9656938689, 8086010833 హెల్‌లైన్‌లు ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం. అన్ని విధాల ప్రజలకు ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించింది. వైమానిక దళం, రాష్ట్ర సహాయక బృందాలు అన్నీ కూడా ప్రస్తుతం సహయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని తెలిపింది. రెండు ఐఏఎఫ్ హెలికాప్టర్లు ఎంఐ-17, ఒక ఏఎల్‌హెచ్‌ను రంగంలోకి దించి గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపుచర్యలు చేపట్టినట్టు పేర్కొంది.  


గాయపడిన వారికి మెరుగైన వైద్యం 
కొండచరియలు విరిగిపడిన ఘటనలో క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందచేస్తున్నామని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వసతులు ఉన్న ఆసుపత్రులను లైన్‌లో పెట్టినట్టు పేర్కొన్నారు. అందరి సేవలు వినియోగించుకుంటున్నామని వివరించారు. వర్తిరి, కల్పత్త, మేప్పాడి, మనంతవాడి ఆసుపత్రులతో సహా అన్ని ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స చేయడానికి సంసిద్ధంగా ఉంచామన్నారు. రాష్ట్రంలోని ఆరోగ్య కార్యకర్తలందరూ సేవలు అందించేందుకు తరలి వస్తున్నారని ఆయా ఆసుపత్రుల్లో వారికి విధులు కేటాయించినట్టు ప్రకటించారు. 


వయనాడ్ చేరుకున్న కేరళ మంత్రులు
కొండచరియలు ప్రాంతాలో జరిగే సహాయకచర్యలను నేరుగా మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. సహాయక చర్యలను సమన్వయం చేస్తామని, సహాయక చర్యలకు నేతృత్వం వహించడానికి మంత్రులు వయనాడ్ చేరుకున్నట్టు సీఎం ప్రకటించారు. వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటం, వర్షాల కారణంగా సంభవించిన విపత్తుల దృష్ట్యా ఆరోగ్య శాఖ (నేషనల్ హెల్త్ మిషన్) కంట్రోల్ రూమ్‌ స్టార్ట్ చేసినట్టు వెల్లడించారు. 


కేరళలో మూడు రోజులు వర్షాలు 
కేరళలో ఇప్పటికే వర్షాలకో ఇబ్బంది పడుతున్న జనాలకు వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇంకా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. వయనాడ్‌లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని, దీని వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉందన్నారు.